Indonesia Open 2023:
ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లారు. తెలుగుతేజం పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రియాన్షు రాజావత్, హెచ్‌ఎస్ ప్రణయ్ అదరగొట్టారు.
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు తొలి పోరులోనే కఠిన డ్రా ఎదురైంది. స్థానిక అమ్మాయి గ్రెగోరియా మారిస్కా తన్‌జంగ్‌తో తలపడింది. 21-19, 21-15 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేసింది. ఈ పోటీకి ముందు ఆమెపై తెలుగు తేజానికి మెరుగైన రికార్డేమీ లేదు. చివరిగా తలపడ్డ రెండుసార్లు ఓటమి చవిచూసింది. ఈసారీ అటాకింగ్ గేమ్‌తో ఆమెపై ప్రతీకారం తీర్చుకుంది. కేవలం 38 నిమిషాల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
తొలి గేమ్‌లో సింధూ షటిల్‌ను వేగంగా అందుకుంది. మునుపటిలా అటాకింగ్ గేమ్‌తో అలరించింది. చక్కని క్రాస్ విన్నర్లు కొట్టింది. మొదట్లో 10-8 తేడాతో వెనకబడ్డ ఆమె వరుసగా ఐదు పాయింట్లతో పుంజుకుంది. ఆ తర్వాత ఇద్దరూ 14-14తో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. సింధూ కోర్టంతా తిరుగుతూ 19-15తో దూసుకెళ్లింది. అప్పటికీ తన్‌జంగ్ ఓటమిని అంగీకరించలేదు. పోరాడింది. 19-19తో స్కోరు సమం చేసింది. అయితే సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ గెలిచింది. రెండో గేమ్‌లో అంత పోటీ ఎదురుకాలేదు. తర్వాతి మ్యాచులోనూ ఆమెకు గట్టి పోటీనే ఎదురవ్వనుంది. మూడో సీడ్, టెక్నికల్‌గా అత్యంత కఠినమైన తైజు ఇంగ్‌తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన అతడు 21-16, 21-14 తేడాతో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోను ఓడించాడు. తర్వాతి రౌండ్లో అతడు కఠిన ప్రత్యర్థి ఎన్‌జీ కా లాంగ్ ఆంగుస్‌తో తలపడతాడు. గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ 21-13, 21-19 తేడాతో లు గ్వాంగ్ జు (చైనా)ను చిత్తు చేశాడు. తొలి గేములో దూకుడుగా ఆడాడు. మరో మ్యాచులో ఎనిమిదో సీడ్, ఇండోనేసియా కుర్రాడు లీ జి జియాను లక్ష్యసేన్ 21-17, 21-13 తేడాతో మట్టకరిపించాడు. అయితే శ్రీకాంత్, లక్ష్యలో ఎవరో ఒక్కరే క్వార్టర్స్ చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రిక్వార్టర్స్ వీరిద్దరూ తలపడుతున్నారు.
ప్రియాన్షు రాజావత్‌కు వాకోవర్ లభించింది. ప్రత్యర్థి ఆటగాడు కునల్‌వుట్ మ్యాచ్ ఆడలేదు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రి క్వార్టర్స్కు చేరుకుంది. 21-12, 11-7 తేడాతో క్రిస్టో పోపోవ్, టోమా జూనియర్ పోపోవ్ జోడీని చిత్తు చేసింది. రెండో గేమ్‌లో 11-7 వద్ద ప్రత్యర్థి జోడీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇక ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల ద్వయం ఓటమి చవిచూసింది. ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్, టియో ఏ యి చేతిలో 12-21, 21-6, 22-20 తేడాతో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జోలి, గాయత్రి గోపీచంద్ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. జపాన్ జోడీ రిన్ ఇవాంగా, కీ నకనిషి చేతిలో 20-22, 21-12, 21-16 తేడాతో పోరాడి ఓడారు.