B Sai Praneeth News: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్స్ కాంస్య పతక విజేత బీ సాయి ప్రణీత్(Sai Praneeth)  అంతర్జాతీయ బ్యాడ్మింటన్(International Badminton) నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై  పిచ్చి ప్రేమతో రాకెట్‌ను తన ఆయుధంగా మార్చుకుని కెరీర్​లో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటి సీనియర్‌ స్థాయిలోనూ దూసుకెళ్లాడు. అలా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ కాంస్య మెడల్ దక్కించుకుని 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. 31 ఏళ్ల ప్రణీత్  టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల తర్వాత నుండి తీవ్రమైన గాయాలతో పోరాడాడు. దాని కారణంగా అతడు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రణీత్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ధృవీకరించారు. 24 సంవత్సరాలుగా నా ప్రాణం లాంటి క్రీడకు వీడ్కోలు పలికేందుకు, రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యానని ప్రణీత్ తెలిపాడు.



"24 ఏండ్లుగా నా జీవితమంతా బ్యాడ్మింటన్ లోనే సాగింది. అయితే విభిన్న భావోద్వేగాల మధ్య బ్యాడ్మింటన్ క్రీడ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్నా" అని బీ సాయి ప్రణీత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ రోజు నుంచి తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని, తన బ్యాడ్మింటన్ కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.  అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ‘వచ్చేనెల మధ్య వారంలో నేను ఒక క్లబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తా. అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తా’ అని సాయి ప్రణీత్ పేర్కొన్నారు.


తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, భార్య శ్వేత నిరంతర ప్రోత్సాహమే తన  విజయాలకు కారణమన్నాడు. గోపీచంద్ అకాడమీ పుల్లెల గోపిచంద్, కోచింగ్ అండ్ సపోర్టింగ్ స్టాప్, చిన్ననాటి కోచ్ లు అరిఫ్, గోవర్ధన్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), టాప్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, యొనెక్స్, ఓఎన్జీసీ, గో స్పోర్ట్స్, ఓజీక్యూ, ఏపీఏసీఎల్, వాట్స్ఇన్ ది గేమ్, పీబీఎల్ తదితరులకు ధన్యవాదాలు తెలిపాడు.


2017లో సింగపూర్‌ ఓపెన్‌ గెలిచిన సాయి ప్రణీత్.. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో నిలువడంతో ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ప్రణీత్ ను గాయాలు వెంటాడాయి. కరోనా విరామం అతడికి ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత అతడు తిరిగి పుంజుకోలేకపోయాడు. గాయాల కారణంగా కూడా బాగానే వెనకబడ్డాడు. టాప్‌-100 లోపు ర్యాంకు కోల్పోవాల్సి వచ్చింది. చివరగా నిరుడు గువాహటి మాస్టర్స్‌ టోర్నీ బరిలో దిగి అతడు ఆడాడు. అంతకుముందు సింగపూర్‌ ఓపెన్‌, కెనడా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు ప్రణీత్‌. భారత ప్రభుత్వం ప్రణీత్ ను 2019 లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్నాడు. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. కెరీర్‌లో అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో పదో ర్యాంక్ పొందిన సాయి ప్రణీత్.. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాడు. కానీ గ్రూప్ దశలోనే షాక్ తో నిష్క్రమించాడు.