Vision Visakha Conference: విశాఖ వేదికగా మంగళ, బుధవారాల్లో వైజాగ్‌ విజన్‌.. ఫ్యూచర్‌ విశాఖ పేరుతో సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు సీఎం జగన్మోహన్‌రెడ్డితోపాటు సుమారు రెండు వేల మంది వరకు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా విశాఖలోని పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడనున్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పారిశ్రామివేత్తలకు ఆహ్వానాలను అందించారు. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హాజరుకానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రుషికొండ దగ్గరలోని రాడిషన్‌ బ్లూ హోటల్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడనున్న సీఎం రాష్ట్ర అభివృద్ధి, విశాఖ నగర ప్రాముఖ్యత, ఈ నగరానికి ఉన్న ఉజ్వల భవిష్యత్‌ గురించి వివరించడంతోపాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో చర్చించనున్నారు. పరిశ్రమలు, పర్యాటకం, హాస్పిటల్స్‌, హోటల్స్‌ వంటి రంగాలకు చెందిన వ్యాపారుల హాజరుకానున్నారు. 


గ్లోబల్‌ సిటీగా విశాఖ


గ్లోబల్‌ సిటీగా విశాఖను ప్రమోట్‌ చేసే ఉద్ధేశంతో సీఎం జగన్‌ ఉన్నారు. ఈ మేరకు తన ఆలోచనను సీఎం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పంచుకోనున్నారు. విశాఖ నగరంలో ఉన్న పర్యాటక అవకాశాలు గురించి సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకువచ్చిన బల్క్‌ డ్రగ్‌ పార్కు గురించి, ఫార్మా రంగంలోఈ ప్రాంతానికి వచ్చిన పెట్టుబడులు, నగర రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధి, ఆధునీకరణ పనులు వంటి గురించి సీఎం వివరించనున్నారు. ప్రపంచ స్థాయి కలిగిన ఇనార్భిట్‌ మాల్‌ వస్తున్న విషయాన్ని, ఐటీ కంపెనీలు వచ్చిన తీరు గురించి సీఎం వ్యాపారులకు వివరించనున్నారు. విశాఖపై ప్రతిపక్షాలు, మీడియా ముఖంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఈ సభా వేదికగా సీఎం తిప్పి కొట్టేలా ప్రసంగం ఉంటుందని ఆ పార్టీ నేతులు చెబుతున్నారు. 




సీఎం జగన్‌ షెడ్యూల్‌ ఇదే


విశాఖలో నిర్వహిస్తున్న సదస్సుకు సీఎం హాజరుకానున్నారు. విజయవాడ నుంచి విమానంలో ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.45కు రుషికొండలోని ఐటీహిల్‌ నంబర్‌-3పై ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన రాడిసన్‌ బ్లూ హోటల్‌కు 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ’వైజాగ్‌ విజన్‌- ఫ్యూచర్‌ విశాఖ’ కార్యక్రమంలో భాగంగా లోగో ఆవిష్కరణ, పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. 12.35కి అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో పీఎంపాలెంలోని వీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ’ది కాస్కేడింగ్‌ సిల్క్స్‌- భవిత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రుషికొండ ఐటీహిల్స్‌-3పైన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని హెలీకాఫ్టర్‌లో ఎయిర్‌పోర్ట్‌కు వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు విమానంలో విజయవాడ తిరిగి వెళ్లనున్నారు.