ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ ప్రారంభంలో స్టేడియం సామర్థ్యం 40 శాతం మందిని అనుమతించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని బ్రిజేష్ పటేల్ తెలిపారు.


లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ ఎడిషన్‌లో మొదటిసారి బరిలోకి దిగనున్నాయి. 10 జట్లూ 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ 74 మ్యాచ్‌ల్లో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి.


వాంఖడే స్టేడియంలో, డీవై పాటిల్ స్టేడియంల్లో చెరో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రబౌర్న్‌, గహుంజే స్టేడియంల్లో చెరో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి 40 శాతం ఆడియెన్స్‌ను అనుమతించనున్నారు.


అయితే ప్లే-ఆఫ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయా లేదా అనే విషయం తెలియరాలేదు. ఈ స్టేడియంలోనే ఫైనల్ కూడా జరగనుంది. బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా ఐపీఎల్‌ను మనదేశంలోనే నిర్వహించనున్నామని గతంలోనే తెలిపారు.


ఒకవేళ మనదేశంలో పరిస్థితులు సహకరించకపోతే... దక్షిణాఫ్రికాను రెండో ఆప్షన్‌గా పెట్టుకున్నామని జే షా పేర్కొన్నారు. మొత్తంగా 12 డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ఈ సీజన్‌లో జరగనున్నాయని తెలుస్తోంది.