Indian Grandmaster R Praggnanandhaa: యువ ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ఓడించాడు. కేవలం ఎనిమిది రౌండ్లలోనే ప్రజ్ఞానంద ఈ విజయం సాధించడం విశేషం. నల్ల పావులతో ఆడుతూ కూడా కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్ ఆట కట్టించాడు.
టరాష్ వెకేషన్ గేమ్‌లో కార్ల్‌సన్ మూడు గేమ్స్‌లో ఈ విజయం సాధించాడు. మొత్తం ఎనిమిది రౌండ్ల తర్వాత ఎనిమిది పాయింట్లతో ప్రజ్ఞానంద 12వ స్థానంలో నిలిచారు. ఇంతకు ముందు జరిగిన రౌండ్లలో ఒక విజయం, రెండు డ్రాలు ఉండగా... నాలుగు గేమ్స్‌లో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
అమెరికాకు చెందిన లెవ్ అరోనియన్‌పై విజయం సాధించగా... అనీష్ గిరి, క్వాంగ్ లీమ్ లెలతో జరిగిన మ్యాచ్‌ల్లో డ్రా చేసుకున్నాడు. ఎరిక్ హాన్సెన్, డింగ్ లిరెన్, జాన్-క్రిజ్‌స్తాఫ్ డూడా, షక్రియార్ మమెద్యరోవ్‌ల చేతిలో ఓటమి చవి చూశాడు.
కొన్ని నెలల క్రితం వరల్డ్ చాంపియన్ షిప్‌లో ఓటమి పాలైన ఇయాన్ నెపోమ్నియాట్చి 19 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... డింగ్ లిరెన్, ఎరిక్ హాన్సెన్‌లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ అనేది ఒక 16 ప్లేయర్ల ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్. ప్రిలిమినరీ రౌండ్లలో విజయం సాధిస్తే మూడు పాయింట్లు, డ్రాకు ఒక పాయింట్ లభిస్తుంది. ప్రిలిమినరీ దశలో ఇంకా ఏడు రౌండ్లు ఉన్నాయి.
2013లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌పై విజయం సాధించి మాగ్నస్ కార్ల్‌సన్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు కార్ల్‌సన్‌కు 16 సంవత్సరాల యువ భారత ఆటగాడు షాకివ్వడం విశేషం.