Abusive Mail To Dronavalli Harika: సామాన్యులకే కాదు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నవారికి సైతం లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కొందరి బుద్ధి మారడం లేదు. తాజాగా భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. లైంగిక వేధింపులకు సంబంధించి తెలుగు తేజం, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక హారిక సంచలన ఆరోపణలు చేశారు. ఓ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్న తనకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలపడం భారత చెస్‌లో కలకలం రేపుతోంది.
గతేడాది నవంబర్‌లో చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు యూరప్ లోని లాత్వియా (Grand Swiss tournament in Riga)కు ప్రపంచ 11వ ర్యాంకర్ ద్రోణవల్లి హారిక వెళ్లారు. ఆ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్న సమయంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపారు. లైంగిక వేధింపులతో కూడిన ఓ లేఖ తనకు వచ్చిందని షాకింగ్ విషయాలు వెల్లడించారు. చెస్ నిర్వాహకులు చక్కగా వ్యవహరించారని చెప్పారు. తనకు ఏ సమస్యా రాకుండా గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ మరియు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సంయుక్త నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారని, తనకు ఆ లేఖ గురించి టోర్నీ చివరిరోజు వరకు తెలియకుండా చూశారని గుర్తుచేసుకున్నారు. తనతో పాటు మరికొందరు క్రీడాకారిణులకు అశ్లీల సందేశాలు మెయిల్స్, లేఖల రూపంలో వచ్చాయన్నారు.
నా పేరుతో ఓ లేఖ వచ్చింది. కానీ ఈ విషయం తెలిస్తే నేను ఇబ్బంది పడతానని ఫిడే, గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ టోర్నమెంట్ చివరిరోజు విషయాన్ని నాకు చెప్పిన అనంతరం పోలీసులకు లేఖను ఇచ్చి ఫిర్యాదు చేశారని పీటీఐతో మాట్లాడుతూ ద్రోణవల్లి హారిక లైంగిక వేధింపుల లేఖ గురించి వెల్లడించారు. ఆ లేఖను తాను తెరిచి చదవకపోవడం అంతా మంచే జరిగిందని, చదివితే ఏ సమస్య వచ్చేదో చెప్పలేం అన్నారు. చెస్ టోర్నమెంట్ నిర్వాహకులు సరైన సమయంలో స్పందించి తనకు సహకారం అందించారని చెప్పుకొచ్చారు. లాత్వియా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారని ఫిడే తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు.
రష్యా మీడియా ప్రకారం.. ఆ టోర్నమెంట్‌లో పాల్గొన్న దాదాపు 15 మంది మహిళా చెస్ క్రీడాకారిణులకు లైంగిక వేధింపుల లేఖలు వచ్చాయి. నవంబర్ నెలలో జరిగిన గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ సమయంలో ప్లేయర్లకు మెయిల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. కొందరు ప్లేయర్లకు అశ్లీలమైన ఫొటోలతో లేఖలు హోటల్ గదికి పంపించారని గుర్తించారు. లైంగిక వేధింపుల మెయిల్ వచ్చిన వారిలో రష్యా గ్రాండ్ మాస్టర్ వాలెంటినా గునియా సైతం ఉన్నారు. మొదట్లో తనకు మాత్రమే లైంగిక వేధింపులు మొదలయ్యాయని భావించినట్లు ఆమె తెలిపింది.