Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు.
శ్రేయస్, జడేజా, శామ్సన్ వీరంగం
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (1: 2 బంతుల్లో) మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో ఇషాన్ కిషన్ (16: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ కావడంతో టీమిండియా 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సంజు శామ్సన్ (Sanju Samson) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ కేవలం 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టిన శామ్సన్ అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు.
ఆ తర్వాత అయ్యర్‌కు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) జతకలిశాడు. జడ్డూ వచ్చిన మొదటి బంతి నుంచి భారీ హిట్టింగ్ చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా వేగంగా ఆటడంతో టీమిండియా 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 4.1 ఓవర్లలోనే 58 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో లహిరు కుమారకు రెండు వికెట్లు, చమీరకు ఒక వికెట్ దక్కాయి.
అదరగొట్టిన నిశ్శంక
అంతకు ముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) బౌలింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పతుం నిశ్శంక, దనుష్క గుణతిలక (38: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) శ్రీలంకు శుభారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు కేవలం 8.4 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవ్వరూ రాణించకపోవడంతో శ్రీలంక 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
క్రీజులో నిలబడిపోయిన నిశ్శంకకు దసున్ షణక (47 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జతకలిశాడు. వీరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట్లో కొంచెం నిదానంగా ఆడిన నిశ్శంక ఆ తర్వాత గేర్లు మార్చేశాడు. కేవలం 26 బంతుల్లో వీరిద్దరూ 58 పరుగులు జోడించడం విశేషం. 17వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు మూడు ఓవర్లలోనే శ్రీలంక ఏకంగా 49 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 23 పరుగులు రావడంతో శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో శ్రీలంక ఏకంగా 72 పరుగులు బాదేసింది.