IND vs SL Test series, Virat Kohli 100th test: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఇకపై టీమ్‌ఇండియా మ్యాచులను ప్రత్యక్షంగా ఎంజాయ్‌ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. శ్రీలంకతో జరిగే రెండో టెస్టు మ్యాచుకు ఫ్యాన్స్‌ను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్‌ సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్లనూ సేల్‌ చేస్తున్నట్టు తెలిసింది. అయితే టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వందో టెస్టును మాత్రం ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం లేదు.


టీ20 తర్వాత టెస్టు సిరీస్‌


భారత్‌, శ్రీలంక జట్లు ఇప్పుడు టీ20 సిరీసు ఆడుతున్నాయి. ఆదివారం మూడో మ్యాచుతో సిరీస్‌ ముగుస్తుంది. వెంటనే రెండు జట్లు మొహాలికి చేరుకుంటాయి. స్వల్ప విరామం తర్వాత ఈ మ్యాచ్‌ జరగనుంది. మార్చి 4 నుంచి 8 వరకు కొవిడ్‌ ఆంక్షలకు లోబడే ఈ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఇది కోహ్లీకి వందో టెస్టు మ్యాచు. దీనిని వీక్షించేందుకు అభిమానులను అనుమతించడం లేదని తెలిసింది.


చిన్నస్వామిలో రెండో మ్యాచ్‌


బెంగళూరులో జరిగే డే/నైట్‌ క్రికెట్‌ మ్యాచుకు మాత్రం 50 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కర్ణాటక క్రికెట్‌ సంఘం (KSCA) అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఇప్పటికే టికెట్ల సేల్‌ మొదలు పెట్టారని తెలిసింది. మొహాలిలో ఫ్యాన్స్‌ను అనుమతించకపోవడానికి, బెంగళూరులో నిబంధనలు మార్చడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టు తర్వాత టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచులు లేవు. ఆటగాళ్లంతా సంబంధిత ఫ్రాంచైజీ శిబిరాలకు వెళ్లిపోతారు. ఒకవేళ బెంగళూరులో కొవిడ్‌ వచ్చినా కోలుకొనేందుకు కొంత సమయం ఉంటుంది. పైగా ఒక బబుల్‌ నుంచి మరో బబుల్‌కు వెళ్తారు కాబట్టి సమస్య ఉండదు. మొహలి విషయంలో అలా లేదు.


కానీ తప్పదు!


'అవును, బీసీసీఐ ఆదేశాల మేరకు టెస్టు మ్యాచుకు సంబంధించిన వారిని తప్ప సాధారణ అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు' అని పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ట్రెజరర్‌ ఆర్పీ సింగ్లా అన్నారు. 'ఇప్పటికీ మొహాలి చుట్టుపక్కల కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. అందుకే భద్రతా నియమాలు పాటించడం ముఖ్యం. మొహలిలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌ను అభిమానులు మిస్సవుతారన్నది నిజమే' అని ఆయన అంటున్నారు.