భారత యువ మహిళలు అదరగొట్టారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టిటాస్ సధుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్‌కు చెందిన గ్రేస్ స్క్రివెన్స్ దక్కించుకుంది.


చెలరేగిన భారత యువ బౌలర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ షెఫాలీ వర్మ బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఈ నిర్ణయం నిజమని నిరూపించారు. స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరగానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిబర్టీ హీప్ (0: 2 బంతుల్లో) వికెట్ తీసి టిటాస్ సధు భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ కోలుకోలేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూనే ఉంది.


రియానా మెక్‌డొనాల్డ్ గే (19: 24 బంతుల్లో, మూడు ఫోర్లు), ఛారిస్ పేవ్లీ (2: 9 బంతుల్లో) ఐదో వికెట్‌కు జోడించిన 17 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. రియానా మెక్‌డొనాల్డ్ గేనే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్ వేసిన ప్రతి భారత బౌలర్‌కు వికెట్ దక్కింది. టిటాస్ సధు, అర్చనా దేవి, పార్శ్వి చోప్రాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. టిటాస్ సధు అద్భుతంగా బౌలింగ్ చేయడం విశేషం. తన నాలుగు ఓవర్ల కోటాలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసింది.


ఆడుతూ పాడుతూ...
భారత జట్టు కూడా ప్రారంభంలోనే ఓపెనర్లు షెఫాలీ వర్మ (15: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), శ్వేతా సెహ్రావత్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్) వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 20 పరుగులు మాత్రమే. అయితే లక్ష్యం తక్కువగానే ఉండటంతో టీమిండియా బ్యాటర్లు ఎక్కడా తత్తర పడకుండా ఆడారు.


సౌమ్య తివారీ (24: 37 బంతుల్లో, మూడు ఫోర్లు), తెలంగాణకు చెందిన ప్లేయర్ గొంగడి త్రిష (24: 29 బంతుల్లో, మూడు ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే విజయానికి కొంచెం ముంగిట గొంగడి త్రిష అవుట్ అయింది. అయితే రిషితా బసు (0: 1 బంతి), సౌమ్య తివారీ మ్యాచ్‌ను ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్ స్క్రివెన్స్, అలెక్సా స్టోన్ హౌస్‌లకు తలో వికెట్ దక్కింది.


అంతకు ముందు జరిగిన సెమీస్‌లో టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టు భారత్‌కు 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున శ్వేతా సెహ్రావత్ తుఫాను బ్యాటింగ్ చేసింది. 45 బంతుల్లోనే 10 ఫోర్ల సాయంతో అజేయంగా 61 పరుగులను శ్వేత సాధించింది. భారత పురుషుల జట్టుకు ఐసీసీ ట్రోఫీల్లో న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారగా, అండర్-19 మహిళల జట్టు మాత్రం అలవోకగా విజయం సాధించడం విశేషం.