IND vs IRE 2nd T20: ఐర్లాండ్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా రెడీ! మ్యాచులో గెలిచి సిరీస్‌ను 2-0తో గెలవాలని పాండ్య సేన పట్టుదలగా ఉంది. మరికొందరు కొత్త కుర్రాళ్లను పరీక్షించేందుకూ యాజమాన్యం సిద్ధమైంది. మరి నేటి మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? పిచ్ స్వభావం ఏంటి? తుది జట్లలో ఎవరుంటారు?
కొత్తగా ఎవరైనా?
నేటి మ్యాచులో టీమ్‌ఇండియా ప్రయోగాలకే పెద్దపీట వేయనుంది. 12 ఓవర్ల పాటు జరిగిన మొదటి టీ20లో కుర్రాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా దీపక్ హుడా (Deepak Hooda) ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అతడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంలోనే 47 నాటౌట్‌గా నిలిచి ఆశలు రేపుతున్నాడు. గాయంతో దూరమైన రుతురాజ్ కోలుకున్నాడో లేదో తెలియదు.
రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. సంజు శాంసన్ సైతం పునరాగమనం కోసం వేచి చూస్తున్నాడు. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్ ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్నాడు. భువనేశ్వర్ బౌలింగ్‌కు తిరుగులేదు. యూజీ సైతం అదరగొట్టాడు. తొలి ఓవర్లోనే 18 పరుగులిచ్చిన ఉమ్రాన్‌కు మరో అవకాశం ఇస్తారో లేదో చూడాలి. అర్షదీప్ ఎదురు చూస్తుండటంతో హర్షల్ పటేల్‌కు ఛాన్స్ ఉండదు.
టాప్ ఆర్డర్ రాణిస్తే!
ఐర్లాండ్ నుంచి అభిమానులు గట్టి పోటీ ఆశిస్తున్నారు. తొలి టీ20లోనూ వెంటవెంటనే మూడు వికెట్లు పడ్డా మిడిలార్డర్ నిలబడింది. 33 బంతుల్లోనే 64 బాదేసిన హ్యారీ టెక్టార్ అందర్నీ ఆకట్టుకున్నాడు. నేటి మ్యాచులోనూ అతడు ప్రతిఘటించే అవకాశం ఉంది. ఆతిథ్య జట్టులో ఒకరిద్దరు నిలిస్తే గౌరవప్రదరమైన స్కోరు రాగలరు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్టిర్లింగ్, బాల్‌బిర్ని, డిలానీ రాణించాల్సిన అవసరం ఉంది. మార్క్ అడైర్ బౌలింగ్ బాగుంది.
బ్యాటింగ్ పిచ్.. కానీ!
సాధారణంగా డబ్లింగ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. తొలిరోజు వర్షం రావడంతో మొదట్లో స్వింగ్‌కు సహకరించింది. ఈ పరిస్థితులను భువనేశ్వర్ బాగా ఉపయోగించుకున్నాడు. నేడూ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ వాతావరణం చల్లగా, మబ్బులు పట్టి ఉంటే బౌలర్లు చెలరేగుతారు.
Ind vs Ire 2nd T20 ProbableXI
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్‌బిర్ని, గారెత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టార్, లార్కన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్