భారత్ X ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు తమ ఆల్‌రౌండర్ మోయిన్ అలీకి కబురు పంపింది. అలీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ‘ది హండ్రెడ్ లీగ్’లో ఆడుతున్నాడు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టుకు అతడిని తిరిగి పిలిపించారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అలీని తిరిగి జట్టులోకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లంతా సరైన ప్రదర్శన చేయకపోతే జట్టులో మార్పులు తప్పవని కోచ్ సిల్వర్‌వుడ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
‘ది హండ్రెడ్ లీగ్’లో అలీ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. బర్మింగ్ హామ్ ఫొనిక్స్ జట్టుకు అలీనే కెప్టెన్. సోమవారం జరిగిన వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్లో అతడు 28 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. దీంతో అతడు టెస్టుల్లోనూ రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘మోయిన్ అలీ ఎప్పటికీ తమ ఫేవరెట్ ప్లేయర్. అతనెప్పుడూ జట్టులో కొనసాగుతాడు . ఈ క్రమంలోనే రెండో టెస్టుకు అతడిని మళ్లీ పిలిపించాం’ అని సిల్వర్‌వుడ్ తెలిపాడు. అతడో మేటి ఆటగాడని, ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాడన్నారు. బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ లాంటి ఆటగాళ్లు ఆల్‌రౌండర్ల జాబితాలో సరిపోతారని.. కానీ ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోవడం బ్యాడ్ లక్ అని అన్నారు. అలీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో చివరిసారి రెడ్‌బాల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత అతడు రొటేషన్ పద్ధతిలో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలీ స్వదేశంలో టెస్టు ఆడింది మాత్రం 2019 యాషెస్ సిరీస్‌లో. ఆ తర్వాత మోయిన్ అలీ ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్ ఆడలేదు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్... ఆతిథ్య ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇక రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది. లార్డ్స్ వేదికగా ఈ టెస్టు జరగనుంది. లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు కోహ్లీ శతకం సాధించలేదు. తొలి టెస్టులో గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ రెండో టెస్టులో తిరిగి ఫామ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.