భారత్ X ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతోన్న రెండో టెస్టు వాడివేడిగా సాగుతోంది. నాలుగో రోజు ఆదివారం మైదానంలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. కోహ్లీxఅండర్సన్ మధ్య మాటల యుద్ధంతో పాటు మరో విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అదే బాల్ టాంపరింగ్. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. 






బాల్ ట్యాంపరింగ్ కలకలం!


అసలేం జరిగిందంటే... నాలుగో రోజు రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బంతిని బూట్ల కింద పెట్టి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. మూడో రోజు (శనివారం) ఆటలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాస్టర్ ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు. ఈ రోజు ఉదయం బంతి కొంత స్వింగ్ అవ్వడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు త్వరగానే మూడు కీలక వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తేమ తగ్గిపోవడంతో బంతి స్వింగ్‌కు అనుకూలించలేదు. బంతి అంతంత మాత్రంగానే  సహకరిస్తుండడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. స్పైక్స్ బూట్లతో బంతిని నొక్కుతూ దాని ఆకారాన్ని మార్చేందుకు యత్నించారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 






బంతిని ట్యాంపర్ చేసేందుకు మూడుసార్లు ప్రయత్నించినట్టు ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఇంగ్లండ్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది కచ్చితంగా బాల్‌ ట్యాంపరింగ్ ప్రయత్నమేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా దీనిపై స్పందించాడు. చూస్తుంటే బాల్ ట్యాంపరింగ్‌లానే ఉందని అభిప్రాయపడ్డాడు. 


ఈ ఫొటోలను చూస్తుంటే క్రికెట్ అభిమానులకు 2018లో ఆసీస్ ఆటగాళ్ల బాల్ టాంపరింగ్ వ్యవహారాన్ని గుర్తుకుచేసింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ ప్యాంట్ జేబులోంచి యెల్లో పేపర్ తీసి బంతిపై రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. దీనిపై పూర్తి విచారణ జరిపిన ఆసీస్ క్రికెట్ బోర్డు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై 12 నెలల నిషేధం విధించగా, టాంపరింగ్ ఉదంతానికి పాల్పడిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.