ఇంగ్లాండ్​తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు టీ బ్రేక్​ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్​ను నిలిపివేశారు.



రెండో రోజు ఆట ఆరంభంలో టీమ్​ఇండియా బాగా ఆడినా.. చివర్లో ఇంగ్లాండ్​ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా టీ బ్రేక్​ సమయానికి భారత జట్టు 46.1 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్​ రాహుల్​(57), పంత్ ​(7) ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 58 పరుగుల వెనకంజలో ఉంది.
 


21/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో భారత్ బరిలోకి దిగింది. టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్​(36), రాహుల్​ నిలకడగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్​ శర్మకు(36) సామ్​కరన్​​ అడ్డుకట్ట వేశాడు. ఫలితంగా 97 పరుగుల తొలి వికెట్​ భాగస్వామ్యానికి తెరపడింది. భోజన విరామానికి ముందు 97/1తో ఉన్న భారత జట్టు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్‌ కోహ్లీ(0), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) ఔటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే రాహుల్‌, పంత్‌ నిలకడగా ఆడారు. జట్టు స్కోరును గాడిలో పెడుతున్నారు. ఈ సమయంలోనే వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు.








టీమ్‌ఇండియా రెండో సెషన్‌లో 46.1 ఓవర్ల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురిసింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో రోజు టీ బ్రేక్తీ సుకుంది. తర్వాత వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు మూడో సెషన్‌ ప్రారంభించారు. కానీ ఒక్క బంతి పడగానే మళ్లీ వర్షం అందుకుంది. రెండోసారి కూడా ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో మళ్లీ కొనసాగించారు. ఆపై అండర్సన్‌ మరో రెండు బంతులు వేయగానే వరుణుడు మూడోసారి అడ్డుపడటంతో మరోసారి నిలిపివేశారు. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


 






మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(4/46) షమి(3/28 ), శార్దూల్​(2/41), సిరాజ్​(1/48) బౌలింగ్ తో దుమ్ములేపారు. ఇంగ్లాండ్​ జట్టులో కెప్టెన్​ జో రూట్​(64) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా 13 ఓవర్లు ఆడి 21/0 తొలి రోజు ఆటను ముగించిన విషయం తెలిసిందే.