India Squad Announced: 2023 బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది. మొదటి రెండు టెస్టులు ఆడిన జట్టుకు మార్పులేమీ చేయలేదు. రంజీ ట్రోఫీ ఫైనల్ కారణంగా జట్టు నుంచి రిలీవ్ అయిన జయ్‌దేవ్ ఉనద్కత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే జట్టు సమతుల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే జయ్‌దేవ్ ఉనద్కత్‌కు తుదిజట్టులో చోటు లభించడం కష్టమే.


చివరి రెండు టెస్టులకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్


బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్‌ను భారత్ ఇప్పటికే రిటైన్ చేసుకుంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరొక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు అధికారికంగా అర్హత సాధించనుంది.


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుర్కొనే మరో జట్టు ఎవరన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడడం ఖాయం.


ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే, ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1 తేడాతో ఓడించాలి. ఆస్ట్రేలియాపై భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అయితే విజయం సాధించాలి, లేదా డ్రా చేసుకోవాలి.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడం దాదాపు ఖాయం.


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది. 


రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది.