టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్స్ చేయనీకుండా అడ్డుకుంది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది.
మ్యాచ్ తొలి క్వార్టర్ ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్ మరో గోల్ సాధించాడు. దీంతో మ్యాచ్ విరామ సమయానికి భారత్ 2-0 గోల్స్ ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్ తొలి గోల్ చేసింది. దీంతో మూడో క్వార్టర్ పూర్తయ్యేసరికి బ్రిటన్ ఒక గోల్ చేసి స్కోర్ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్ సింగ్ మూడో గోల్ చేసి భారత్ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు.
ఒలింపిక్స్‌లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినా.. తర్వాత కళ తప్పిన భారత హాకీ.. ఈసారి అద్భుతం చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న మన టీమ్.. లీగ్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌లకు గాను 4 గెలిచింది. 49ఏళ్ల తర్వాత సెమీస్ చేరిన భారత హాకీ జట్టుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 3న సెమీ ఫైనల్‌లో బెల్జియంతో భారత్ తలపడనుంది.
భారత్ ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే.. ఏదో ఒక పతకం సాధించడం ఖాయం అనిపిస్తోంది. భారత హాకీ జట్టు 1980లో చివరిసారి ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. గతంలో జరిగిన ఒలింపిక్స్‌లో మొత్తం 8 స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు అందుకున్న భారత హాకీ జట్టు.. 1980లో చివరిసారి స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత జట్టు కళ తప్పింది. అప్పటి నుంచి ఒలింపిక్స్‌లో పూల్, క్వార్టర్‌ఫైనల్‌లో ఓడిపోయి వెనుదిరిగేది. తాజాగా క్వార్టర్ ఫైనల్‌లో గెలుపొందడంతో 49 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది.
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొన్న పంజాబ్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే.. అందులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున నజరానా అందజేస్తామని గుర్మీత్ సింగ్ సోధి శుక్రవారం వెల్లడించారు. విశ్వక్రీడల్లో పంజాబ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.