Asian Para Games 2023 India Medals Tally:  


ప్రపంచక్రీడా వేదికపై భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వరుసగా పతకాలు సాధిస్తూ అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత కీర్తి పతాకను  ఎగరేస్తున్నారు. 2023ఆసియా క్రీడల్లో 107 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్.. పారా ఆసియా గేమ్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. చైనాలోని హాంగ్జౌ వేదికగానే జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో ఇప్పటికే భారత్ 110కుపైగా పతకాలు సాధించి అద్భుతం సృష్టించింది. ఆసియా గేమ్స్‌ను మించి పారా ఆసియా గేమ్స్‌లోనూ పతకాలు సాధించడంపై ఆటగాళ్లపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. వరుసగా పతకాలు సాధిస్తూ భారత ఆటగాళ్లు ఈసారి పారా ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించారు. పురుషుల 400 మీటర్ల టీ 47 ఈవెంట్‌లో భారత పారా అథ్లెట్  గావిట్ స్వర్ణ పతకం సాధించి సత్తా చాటాడు. పారా ఆసియా గేమ్స్‌లో పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్.. పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు వందో పతకం అందించాడు. పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు వందో పతకం అందించి తన పేరును  సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 


ఇప్పటి వరకు ఆసియా పారా క్రీడల్లో భారత్‌  29 బంగారు పతకాలు, 31 రజత, 51 కాంస్య పతకాలతో 111 మెడల్స్‌ను ఖతాలో వేసుకుంది. ఈ మెడల్స్‌ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 110కుపైగా పతకాలతో పారా ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో నయా భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా పారా గేమ్స్‌లో గతంలో ఎప్పుడూ భారత బృందం 110కుపైగా పతకాలు సాధించలేదు. ఇది భారత క్రీడా చరిత్రలో అద్భుత సమయమని క్రీడా ప్రేమికులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన మైలురాయిని చేరుకుని భారత క్రీడా ప్రతిభను అథ్లెట్లు విశ్వవ్యాప్తం  చేశారని పొగడ్తలతో ముంచేస్తున్నారు. తొలిసారి 303 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఊహించని రికార్డును బద్దలు కొట్టింది. 


భారతదేశం ఈ చారిత్రాత్మక విజయం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో స్పందించారు. భారత యువతకు సాధ్యం కానిది ఏదీ లేదన్న మోదీ... క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 100కుపైగా పతకాలా రావడం అనేది మన క్రీడాకారుల ప్రతిభ, కృషి, సంకల్పాల  ఫలితం అన్నారు. ఈ అద్భుతమైన మైలురాయి అందరి  హృదయాలను అపారమైన గర్వంతో నింపిందంటూ క్రీడాకారులకు  అభినందనలు తెలిపారు. ఈ  అద్భుతమైన అథ్లెట్లు, కోచ్‌లు, వారితో పని చేస్తున్న మొత్తం సహాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పారా ఆసియా గేమ్స్‌లో భారత విజయాలు అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. ఈసారి పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారిణి శీతల్ మొదటి బంగారు పతాకాన్ని అందుకోగా... దిలీప్ మహదు గవిత్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 100కు చేరింది. ఈ విషయాన్ని మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన మరో నాలుగు గంటల్లో పతకాల సంఖ్యా 111కి చేరింది. 


ఆసియా పారా క్రీడల్లో  చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కాంస్య పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో అగ్రస్థానంలో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్‌ రెండో స్థానం ఆ‍క్రమించింది. తరువాత సౌత్ కొరియా, జపాన్, తరువాత 111 పాతకాలతో 5 వ స్థానంలో ఉంది. జకార్తాలో జరిగిన 2018 పారా గేమ్స్‌లో దేశానికి ఇంతకుముందు అత్యధిక పతకాలు వచ్చాయి. అప్పట్లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలతో సహా 72 పతకాలు సాధించారు.  ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.