IND vs AUS, CWG 2022: కామన్వెల్త్‌ క్రీడలను హర్మన్ సేన ఓటమితో ఆరంభించింది. చేతికందిన బంగారం లాంటి అవకాశాన్ని నేలపాలు చేసింది. తిరుగులేని గెలుపుతో విజయ ఢంకా మోగించాల్సిన చోట నిరాశతో డ్రెస్సింగ్‌ రూమ్‌ బాట పట్టింది. టీ20 ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.


కొంప ముంచిన ఆ ఇద్దరు!


ఛేదనలో రేణుకా సింగ్‌ (4/18) దెబ్బకు ఆసీస్‌ 49 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఓటమి అంచున నిలిచిన ఆ జట్టును ఆష్లే గార్డనర్‌  (52; 35 బంతుల్లో 9x4, 0x6), గ్రేస్‌ హ్యారిస్‌  (37; 20 బంతుల్లో 5x4, 2x6) ఆదుకున్నారు. 6 వికెట్‌కు 34 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యం అందించారు. హ్యారిస్‌ ఔటైనా గార్డ్‌నర్‌ ఆగలేదు. 8వ వికెట్‌కు కింగ్‌తో కలిసి 28 బంతుల్లో 47 పరుగుల అజేయ భాగస్వామ్యంతో చెలరేగింది. అంతకు ముందు భారత్‌లో  ఓపెనర్‌ షెఫాలీ వర్మ (48; 33 బంతుల్లో 9x4), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52; 34 బంతుల్లో 8x4, 1x6), స్మృతి మంధాన (24; 17 బంతుల్లో 5x4) రాణించారు. ఆసీస్‌లో జెస్‌ జొనాసన్‌ 4 వికెట్లు పడగొట్టింది.




ఆరంభంలో షెఫాలీ!


ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ కాస్త మందకొడిగా ఉండటంతో టాస్‌ గెలిచిన హర్మన్‌ వెంటనే బ్యాటింగ్‌ ఎంచుకుంది. రావడం రావడమే ఓపెనర్‌ స్మృతి మంధాన దంచికొట్టడం షురూ చేసింది. దూకుడుగా ఆడుతున్న ఆమెను జట్టు స్కోరు 25 వద్ద బ్రౌన్‌ ఔట్‌ చేసింది. ఆ తర్వాత యస్తికా భాటియా (8) అండతో షెఫాలీ బౌండరీలు బాదేసింది. దాంతో 46 బంతుల్లోనే టీమ్‌ఇండియా స్కోరు 50 దాటేసింది.


ఆఖర్లో హర్మన్‌!


దూకుడు పెంచి హాఫ్‌ సెంచరీకి చేరువైన షెఫాలీని కీలక సమయంలో జొనాసెన్‌ పెవిలియన్‌ పంపించింది. అప్పుడు టీమ్‌ఇండియా స్కోరు 93. ఒకవైపు జెమీమా (11), దీప్తి శర్మ (1), హర్లీన్‌ డియోల్‌ (7) త్వరగా ఔటైనా కెప్టెన్‌ హర్మన్‌ మరోవైపు గట్టిగా నిలబడింది. మొదట్లో సింగిల్స్‌ తీస్తూ నిలదొక్కుకుంది. ఆఖర్లో వరుస బౌండరీలు, సిక్సర్లు బాదేసి స్కోరును 150 దాటించింది. చివరి ఓవర్లో ఆమెను మెగాన్‌ షూట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో భారత్‌ 154/8కి పరిమితమైంది.