Chikoti Praveen Whatsapp Data  :  కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ప్రముఖ సినీతారలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు బుక్కయ్యే అవకాశం కనిపిస్తోంది. చీకోటి ప్రవీణ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఈడీకీ చాలా మంది ప్రముఖులతో నిర్వహించిన లావాదేవీలు సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్‌ ఫోన్‌నుకూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని.. వాట్సాప్ సమాచారాన్ని మొత్తం  విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాప్ ట్యాప్‌తో పాటు మరి కొన్ని డిజిటల్ ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు. వాటన్నింటినీ విశ్లేషిస్తున్నారు. 


చీకోటి వాట్సాప్ ఖాతాలో కీలక సమాచారం సేకరించిన ఈడీ
 
హవాలా లావాదేవీలతో పాటు కేసినోకు సంబంధించి  లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారం ఉన్నట్లుగా తెలు్సతోంది. ఇప్పటి వరకూ చికోటికి చెందిన నాలుగు బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వాటి నుంచి  పెద్ద  పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. నగదు లావాదేవీలకు సంబంధించి వాట్సాప్‌లో కీలక డేటా ఉండటంతో  .. అందులో పేర్లు ఉన్న వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరూ ప్రముఖులే కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. 


20 మంది ప్రజాప్రతినిధులు - 10 మంది తారలకు త్వరలో ఈడీ నోటీసులు ?


చికోటి ప్రవీణ్‌తో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది ప్రజా ప్రతినిధులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరో పది మంది సినీ తారలూ లావాదేవీలు నిర్వహించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన చాటింగ్ .. చీకోటి ప్రవీణ్ వాట్సాప్ ఖాతాలో ఉంది. గోవాలో ప్రముఖ కేసినో అయిన  బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపించేవాడు. ఈ చాటింగ్ అంతా ఈడీ అధికారుల చేతుల్లో ఉంది. 


హవాలా లావాదేవీలపైనే ప్రధానంగా ఈడీ విచారణ 


చికోటి ప్రవీణ్ భారీ లావాదేవీలు జరిపిన వారందరినీ ఈడీ ప్రశ్నించనుంది. ఈ లావాదేవీల్లో అత్యధికం హవాలానే. ఇతర దేశాల్లో కేసినోలు నిర్వహించినప్పుడు ఇక్కడ రూ. కోట్లు డబ్బులు నగదు రూపంలో తీసుకుని..  ఏ దేంలో అయితే కేసినో అడతారో ఆ దేశ కరెన్సీని అక్కడే ఇచ్చేవారు. తర్వాత అదే పద్దతిలో రూపాయిల్ని మార్చేవారు. ఇదంతా అక్రమం. దీన్ని ఇప్పుడు ఈడీ చేధించాల్సి ఉంది. మొత్తం గుట్టు  బయటకు వస్తే.. కేసినో.. దాని వెనుక ఉన్న హవాలా మొత్తం బయటకు వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో సినీ,  రాజకీయ, వ్యాపార ప్రముఖుల బండారం అంతా బయటపడుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.