Rohit Sharma T20I Record: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో అర్ధశతకంతో దుమ్మురేపాడు. పనిలో పనిగా మరో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఎక్కువ హాఫ్ సెంచరీల ఘనతనూ అందుకున్నాడు.
విండీస్‌తో మ్యాచుకు ముందు అత్యధిక పరుగుల రికార్డు మార్టిన్ గప్తిల్ పేరుతో ఉండేది. అయితే బ్రయన్ లారా స్టేడియంలో హిట్‌మ్యాన్ 21 పరుగులు చేయగానే ఈ రికార్డు బద్దలైంది. మొత్తంగా 129 మ్యాచుల్లో అతడు 3443 పరుగులు చేశాడు. 116 మ్యాచుల్లో గప్తిల్ చేసిన 3399 రన్స్ రికార్డును అధిగమించాడు.
కొన్ని నెలలుగా అత్యధిక పరుగుల రికార్డు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. మ్యాచులు సాగే కొద్దీ రోహిత్, గప్తిల్, విరాట్ కోహ్లీ ఒకర్ని దాటేసి ఒకరు ముందుకెళ్లేవారు. ప్రస్తుతం విరాట్ 3308 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 2,894తో పాల్ స్టిర్లింగ్, 2,894 రన్స్‌తో ఆరోన్ ఫించ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
విండీస్ మ్యాచులోనే రోహిత్ అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. 31వ అర్ధశతకం బాదేసి విరాట్‌ను వెనక్కి నెట్టేశాడు. అగ్ర స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (30), బాబర్ ఆజామ్ (27), డేవిడ్ వార్నర్ (23), మార్టిన్ గప్తిల్ (22) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
IND vs WI 1st T20 Highlights: ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. బ్రయన్ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను 68 రన్స్ తేడాతో చిత్తు చేసింది. 191 టార్గెట్ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 122/8 పరుగులకే పరిమితం చేసింది. షమ్రా బ్రూక్స్ (20) టాప్ స్కోరర్. అంతకు ముందు భారత్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (64; 44 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (24; 16 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. దినేశ్ కార్తీక్ (41*; 19 బంతుల్లో 4x4, 2x6) ఫినిషింగ్ టచ్‌తో అలరించాడు.
బౌలింగ్ అదుర్స్
భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు టీమ్‌ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్తుల్లో బంతులు విసిరారు. పవర్ ప్లే ముగిసే సరికే 3 వికెట్లు పడగొట్టారు. కైల్ మేయర్స్ (15)ను అర్షదీప్, జేసన్ హోల్డర్ (0)ను జడేజా, షమ్రా బ్రూక్స్ (20)ను భువీ పెవిలియన్ పంపించారు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ (18), రోమన్ పావెల్ (14), హెట్‌మైయర్ (14) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ భారత బౌలర్లు వారి ఆటలు సాగనివ్వలేదు. కీలక సమయాల్లో ఔట్ చేయడంతో విండీస్ 13.2 ఓవర్లకు 86/7తో నిలిచింది. ఇన్నింగ్స్ వేగం తగ్గడంతో సమీకరణం 30 బంతుల్లో 93గా మారింది. కాసేపు అకేల్ హుస్సేన్ (11), కీమో పాల్ (19) ప్రతిఘటించినా ఏం చేయలేకపోయారు. అర్షదీప్, అశ్విన్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.