రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియాతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అంటున్నాడు. అతడితో తలపడటం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌పై విజయాల జోరునే ఉపఖండంలోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.


ఈ సారి వెస్టిండీస్‌, టీమ్‌ఇండియా మధ్య పరిమిత ఓవర్ల సిరీసులు ఆసక్తిగా సాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో టీ20లను విండీస్‌ను మించి అద్భుతంగా ఆడే జట్టు మరొకటి లేదు. ఆ జట్టు నిండా భయంకరమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లే ఉంటారు. నిమిషాల్లో మ్యాచులు గమనాన్ని మార్చేస్తారు. అన్నింటినీ మించి హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ, బిగ్‌ మ్యాన్‌ కీరన్‌ పొలార్డ్‌ మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్‌లోనే కీరన్‌ పొలార్డ్‌ ఆడతాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఒకరి బలాబలాలేంటో మరొకరికి బాగా తెలుసు. ఇద్దరూ భారీ హిట్టర్లే. ముంబయి ఐదుసార్లు టైటిల్‌ గెలవడంలో కీరన్‌ పాత్ర ఎంతైనా ఉంది. ఈ సారీ అతడిని ఆ జట్టు రీటెయిన్‌ చేసుకుంది. రూ.16 కోట్లతో రోహిత్‌, రూ.12 కోట్లతో జస్ప్రీత్‌ బుమ్రా, రూ.8 కోట్లతో సూర్యకుమార్‌ యాదవ్‌, రూ.6 కోట్లతో కీరన్‌ పొలార్డును ఎంచుకుంది.




ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీసులో వెస్టిండీస్‌ 3-2తో విజయం సాధించింది. అదే జోరుతో సోమ లేదా మంగళవారం భారత్‌లో అడుగుపెట్టనుంది. భారత సిరీసుకు జట్టునూ ప్రకటించింది. 'ఇంగ్లాండ్‌పై గొప్ప విజయం అందుకున్నాం. ఇప్పుడు భారత పర్యటనలోనూ సానుకూల ఫలితాన్నే కోరుకుంటున్నాం. రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియాతో తలపడటం ఆసక్తికరం, ప్రత్యేకం' అని కీరన్‌ అంటున్నాడు. 'మా జట్టులో మంచి వన్డే ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ సిరీసులో కొత్త ప్రతిభావంతులను కనుగొన్నాం. ఉపఖండంలోనూ వారిలాగే అదరగొడతారని ధీమాగా ఉన్నా' అని అతడు వెల్లడించాడు.


షెడ్యూలు ఇదే: ఫిబ్రవరి 6, 9, 11న మొతెరా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. 16, 18, 20న కోల్‌కతా వేదికగా టీ20లు నిర్వహిస్తారు. ఇందుకోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత సన్నాహక శిబిరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాచులు మొదలవుతాయి.


టీమ్‌ఇండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌