పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే రామ్ గోపాల్ వర్మకు అభిమానమా? కోపమా? అనేది చెప్పడం కష్టం. పవన్ మీద అభిమానం ఉందని ఆయన అంటుంటారు. కానీ, పవన్ గురించి చేసే ట్వీట్స్ చూస్తే వెటకారంగా ఉన్నాయని కొందరు చెబుతుంటారు. పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వర్మ ఓ షార్ట్ ఫిల్మ్ తీసి ఓటీటీలో విడుదల చేశారు కూడా! ఒక్క పవన్ మాత్రమే కాదు... మెగా హీరోల గురించి పలు సందర్భాల్లో ఆయన ట్వీట్స్ చేస్తుంటారు. అందుకే, వర్మ అంటే మెగా అభిమానులకు కోపం. మెగా హీరోల కంటే అల్లు అర్జున్ బెటర్ అన్నట్టు గతంలో ట్వీట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో పోలుస్తూ ట్వీట్స్ చేశారు.


'భీమ్లా నాయక్'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనేది వర్మ డిమాండ్. 'సర్దార్ గబ్బర్ సింగ్'ను హిందీలో విడుదల చేయవద్దని మొత్తుకున్నా వినలేదని, ఇప్పుడు 'భీమ్లా నాయక్'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి పవర్ ప్రూవ్ చేయాలనేది వర్మ చెబుతున్న మాట. ఇంకా ఆయన ఏమన్నారో... మీరే చదవండి! వీటిపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో?


"పుష్ప'యే అంత (కలెక్ట్) చేస్తే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన మీరు నటించిన 'భీమ్లా నాయక్' ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? పాన్ ఇండియా సినిమాలాగా (భీమ్లా నాయక్ ను) రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము. అల్లు అర్జున్ గురించి చేసిన ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైంలో పెట్టాను. కానీ, ఇప్పుడు నేను పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే... మీరు ఇంకా ఒట్టి తెలుగును పట్టుకుని వేలాడటం.. మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి 'భీమ్లా నాయక్'ను పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఆంధ్రలో జరిగిన 'పుష్ప' సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు... కొమురం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు... 'భీమ్లా నాయక్' సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కల్యాణ్ గారూ?" అని వర్మ ట్వీట్స్ చేశారు.


వర్మ వెర్షన్ చదివితే... పవన్ మీద అభిమానం కంటే వెటకారం ఎక్కువ కనబడుతోందనేది నెటిజన్స్ మాట. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.