IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో సంజు శాంసన్‌కు (Sanju Samson) చోటివ్వకపోవడం న్యాయం కాదని టీమ్‌ఇండియా మాజీ పేసర్ దొడ్డ గణేశ్ అంటున్నారు. వాస్తవంగా పొట్టి క్రికెట్లో అలాంటి క్రికెటర్లే అవసరమని పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ కోసం అతడిని పక్కన పెట్టడం ఎంత వరకు సబబని విమర్శించారు.
'నిజం చెప్పాలంటే టీ20 క్రికెట్‌కు సుంజు శాంసన్ వంటి క్రికెటర్లే అవసరం. శ్రేయస్ అయ్యర్ కోసం అతడిని పక్కనబెట్టడం క్రికెట్ లాజిక్‌కు విరుద్ధం' అని దొడ్డ గణేశ్ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు చాలామంది సంజుకు అండగా నిలిచారు. ట్విటర్లో '#SanjuSamson' హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
'నేనైతే సంజు శాంసన్‌కు మద్దతిస్తా. కనీసం విండీస్ టూర్‌కు జట్టులోకి తీసుకోకపోవడానికి అతడు చేసిన తప్పేంటి? ఒంటిపై టాటూలు లేకపోవడం, మంచి హెయిర్ స్టైల్ లేకపోవడం, కేరళ ఆటగాడు అవ్వడం, ఎలాంటి లాబీలో ఉండకపోవడమే కారణాలా?' అంటూ ఒకరు విమర్శించారు.
మరికొందరు చివరి మూడు టీ20ల్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ చేసిన స్కోర్లను పోలుస్తూ ట్వీట్ చేశారు. 'చివరి మూడు టీ20ల్లో టీమ్‌ఇండియా వికెట్ కీపర్ల స్కోర్లివి. రిషభ్ పంత్ 1, 26, 1; దినేశ్ కార్తీక్ 11, 12, 6; ఇషాన్ కిషన్ 26, 3, 8; సంజు శాంసన్ 39; 18; 77 మరి బాగా ఆడుతున్న కుర్రాడినే ఎందుకు తొలగించారో ఎవరైనా చెప్పగలరా?' అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
సంజు శాంసన్ 2015లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో తొలి టీ20 ఆడాడు. అలాంటిది అతనాడిని మొత్తం టీ20 మ్యాచులు కేవలం 13. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. వరుసగా 3 మ్యాచులు ఆడించిన సంఘటనలు అత్యంత అరుదు.
ఒకవేళ విఫలమైతే సంజూను బెంచ్ మీదే కూర్చోబెట్టేవారు. నిలకడ లేకపోవడం వల్లే అతడిని తీసుకోవడం లేదని గతంలో విమర్శలు వచ్చేవి. రెండేళ్లు తన లోపాలను సరిదిద్దుకున్న అతడు ప్రస్తుతం నియంత్రిత దూకుడుతో రెచ్చిపోతున్నాడు. ఊరికే వికెట్ పారేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఎందుకు తీసుకోవడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.