IND vs WI 3rd T20 Highlights: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 7 వికెట్ల తేడాతో సిరీసులో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (76; 44 బంతుల్లో 8x4,4x6) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రిషభ్‌ పంత్‌ (33*; 26 3x4, 1x6) అజేయంగా నిలిచాడు. అంతకు ముందు విండీస్‌లో కైల్‌ మేయర్స్‌ (73; 50 బంతుల్లో 8x4,4x6) విజృంభించాడు. రోమన్‌ పావెల్‌ (23), నికోలస్‌ పూరన్‌ (22) ఫర్వాలేదనిపించారు.






హిట్‌మ్యాన్‌ రిటైర్డ్‌ హర్ట్‌!


సెయింట్‌ కీట్స్‌లో ఛేదనను టీమ్‌ఇండియా మెరుగ్గానే ఆరంభించింది. అయితే జట్టు స్కోరు 19 వద్ద రోహిత్‌ శర్మ (11) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో శ్రేయస్‌ అయ్యర్‌ (24) కలిసి సూర్యకుమార్‌ రెచ్చిపోయాడు. విండీస్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అతడి దెబ్బకు పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు వచ్చాయి. అదే ఊపులో సూర్య 26 బంతల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకోవడంతో రెండో వికెట్‌కు 86 (59) రన్స్‌ భాగస్వామ్యం లభించింది. జట్టు స్కోరు 105 వద్ద హుస్సేన్‌ బౌలింగ్‌ శ్రేయస్‌ను థామస్‌ స్టంపౌట్‌ చేశాడు. ఈ క్రమంలో సూర్య, హార్దిక్‌ (4) వెంటవెంటనే ఔటనా దీపక్‌ హుడా (10*)తో కలిసి రిషభ్ పంత్‌ విజయం అందించాడు.


ఆలస్యంగా మ్యాచ్


భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 సెయింట్‌ కీట్స్‌లోని బసెటెరెలో జరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌ మొదలైంది. 9:00 గంటలకు టాస్‌ వేశారు. వాస్తవంగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవ్వాలి. రెండో టీ20 నాలుగు గంటలు ఆలస్యంగా మొదలవ్వడంతో ఈ మ్యాచు సమయం మార్చారు. ఆటగాళ్లకు విశ్రాంతి దొరకాలనే రెండు జట్లు ఇందుకు అంగీకరించాయి.