IND vs WI 2nd ODI, Mohammed Siraj: వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆఖర్లో ఎంతో భావోద్వేగానికి గురయ్యానని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అక్షర్‌ పటేల్‌ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించాడని పేర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో తనకే సిక్సర్‌ కొట్టి గెలిపించాలన్న కసి వచ్చేసిందని వెల్లడించాడు. అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది.


వెస్టిండీస్‌తో థ్రిల్లింగ్‌గా సాగిన రెండో వన్డేలో టీమిండియా రెండు వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో టీమిండియా సొంతం అయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ విన్నింగ్ ఫిఫ్టీతో పాటు వికెట్ కూడా తీసిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి టీమిండియా గెలవడం విశేషం.


'ఓరి దేవుడా! ఆ ప్రశ్న అడగొద్దు బ్రదర్‌! చాలా భావోద్వేగానికి గురయ్యాం. అక్షర్‌ పటేల్‌ మాత్రం దూకుడుగా కనిపించాడు. మేమంతా ఆత్మ విశ్వాసంతోనే ఉన్నాం. ఆ పరిస్థితుల్లో నేనైనా సిక్సర్‌ బాదగలనేమో అనిపించింది. కానీ సింగిల్‌ తీసి అక్షర్‌కు స్ట్రైక్‌ ఇవ్వడమే సరైన నిర్ణయం' అని సిరాజ్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌ గెలిచాక సంబరాలు అంబరాన్ని అంటాయి. ఊపిరి బిగపట్టి, ఉత్కంఠతో చూసిన కుర్రాళ్లు ఎగిరి గంతులేశారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఉత్సాహంగా కనిపించాడు.




అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్‌ షో..


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభం అయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (13: 31 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (43: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు) 16 ఓవర్లలోపే అవుటయ్యారు.  సూర్యకుమార్ యాదవ్ (9: 8 బంతుల్లో, ఒక సిక్సర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. టీమిండియా 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (63: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (54: 51 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు.


కీలక దశలో శ్రేయస్‌ను అల్జారీ జోసెఫ్ అవుట్ చేయగా, సంజు శామ్సన్ రనౌట్ అయ్యాడు. వీరు అవుటయ్యాక వచ్చిన దీపక్ హుడా (33: 36 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (64 నాటౌట్: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 33 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. చివర్లో దీపక్ హుడా అవుటైనా అక్షర్ పటేల్ టెయిలెండర్లతో కలిసి మ్యాచ్‌ను ముగించాడు.