Virat Kohli Convinces Rohit Sharma: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య అనుబంధం బాగుందనేందుకు మరో ఉదాహరణ! వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవనేందుకు ఇదే సాక్ష్యం! వెస్టిండీస్‌తో తొలి టీ20లో చాలా సందర్భాల్లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. హిట్‌మ్యాన్‌కు అవసరమైన ప్రతిసారీ కోహ్లీ అండగా నిలిచాడు. అతడిచ్చిన సూచనలతో కెప్టెన్ రోహిత్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.
కోహ్లీ సలహాలు
వెస్టిండీస్ క్రికెటర్ రోస్టన్ ఛేజ్ విషయంలో విరాట్ కోహ్లీ సలహాలను రోహిత్ శర్మ తీసుకున్నాడు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో స్టంప్‌మైక్‌లో స్పష్టంగా వినిపించింది. ఈ మ్యాచులో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ను వేశాడు. అతడు వేసిన ఓ గూగ్లీ లెగ్‌సైడ్ వెళ్లింది. అప్పుడు చిన్నపాటి శబ్దం వచ్చింది. వెంటనే బంతి అందుకున్న రిషభ్ పంత్ స్టంప్స్ ఎగరగొట్టాడు. దాంతో ఆటగాళ్లంతా అంపైర్‌కు అప్పీల్ చేశారు. కానీ మైదానంలోని అంపైర్ జయరామన్ మదనగోపాల్ వైడ్‌గా సిగ్నల్ ఇచ్చారు.
అర్థం కాకపోవడంతో
ఆ సమయంలో రోహిత్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆటగాళ్లంతా సమీక్ష తీసుకుంటే బెటర్ అన్నట్టుగానే సలహాలు ఇస్తున్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ వచ్చి రెండుసార్లు శబ్దం వినిపించిందని చెప్పాడు. 'మై బోల్ రహా హూ, తూ రివ్యూ లే' అంటూ హిట్‌మ్యాన్‌కు సూచన చేశాడు. దాంతో ఆత్మవిశ్వాసం తెచ్చుకున్న అతడు రివ్యూ అడిగాడు.
వీడియో రిప్లేలో ఏం తేలిందంటే
వీడియో రిప్లే చూస్తే ఛేజ్ ఔట్ కానట్టు తెలిసింది. పిచైన బంతి ఛేజ్ తొడలను తాకినట్టు కనిపించింది. పంత్ వికెట్లను గిరాటేసినా బ్యాటర్ క్రీజు దాటలేదని తెలిసింది. నిర్ణయం అనుకూలంగా రాకపోయినా టీమ్‌ఇండియా డీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. అంపైర్ వైడ్‌ను రద్దు చేసి సరైన బంతిగా నిర్ణయించాడు.
అదరగొట్టిన రవి బిష్ణోయ్
ఈ మ్యాచులో రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. తొలుత నికోలస్ పూరన్ బాదిన బంతిని అందుకున్న అతడు బౌండరీలైన్‌ను తాకాడు. దాంతో ఆందోళనకు గురయ్యాడు. మొదట్లో రెండుమూడు బంతుల్ని సరిగ్గా విసిరలేదు. ఆ తర్వాత పుంజుకొని ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 4 ఓవర్లు విసిరి 17 పరుగులు ఇచ్చాడు. అతడిని టీమ్‌ఇండియా ఆటగాళ్లు, సహాయ బృందం అభినందించారు.