IND vs WI 1st T20: తొలి టీ20లో గెలిచినందుకు సంతోషంగా ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 10 ఓవర్లు దాటాక 190 స్కోర్‌ చేస్తామని అనుకోలేదని పేర్కొన్నాడు. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్, రవిచంద్రన్‌ అశ్విన్ భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించాడు. విజయం సాధించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


ఈ మ్యాచులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. అతడు ఔటయ్యాక స్కోరు వేగం తగ్గింది. స్కోరు 150 దాటేలా కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలబడ్డారు. ఆఖరి నాలుగు ఓవర్లలో 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. డీకే అయితే 19 బంతుల్లోనే 41 దంచికొట్టాడు. దాంతో భారత్‌ 190 స్కోర్‌ చేసింది.


'పిచ్‌ మందకొడిగా ఉండటంతో స్కోర్‌ చేయడం సులభం కాదని తెలుసు. ఆరంభంలో షాట్లు కొట్టడం తేలిగ్గా అనిపించలేదు. నిలదొక్కుకున్న వాళ్లే ఎక్కువ సేపు ఆడాలి. అందుకే మేం తొలి ఇన్నింగ్స్‌ను ఇలా ముగించడం అద్భుతమే. తొలి పది ఓవర్లు ముగిశాక మా స్కోరు 190 అవుతుందని అస్సలు ఊహించలేదు' అని రోహిత్‌ అన్నాడు.


'కుర్రాళ్లు బాగా ఆడారు. అద్భుతంగా ముగించారు. ఆటలో మేం మూడు అంశాల్లో మెరుగవ్వాలని ప్రయత్నిస్తున్నాం. బ్యాటింగ్‌లో కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. ఏదేమైనా మేం గొప్పగా ఆడాం. కొన్ని పిచ్‌లు ఇలాంటి పోరాటాలకు అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడే ఎంత వరకు పోరాడగలమో ఆలోచించుకోవాలి. మన నైపుణ్యాలు, బలాలను విశ్వసించాలి' అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.


వెస్టిండీస్‌తో తొలి టీ20లో రోహిత్‌ రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఎక్కువ హాఫ్‌ సెంచరీల ఘనతనూ అందుకున్నాడు. విండీస్‌తో మ్యాచుకు ముందు అత్యధిక పరుగుల రికార్డు మార్టిన్‌ గప్తిల్‌ పేరుతో ఉండేది. అత్యధిక హాఫ్‌ సెంచరీల రికార్డునూ అతడే బద్దలు కొట్టాడు. 31వ అర్ధశతకం బాదేసి విరాట్‌ను వెనక్కి నెట్టేశాడు. అగ్ర స్థానానికి చేరుకున్నాడు. విరాట్‌ కోహ్లీ (30), బాబర్‌ ఆజామ్‌ (27), డేవిడ్‌ వార్నర్‌ (23), మార్టిన్‌ గప్తిల్‌ (22) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.