IND vs WI 1st ODI Preview:  పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆంగ్లేయులను వణికించిన టీమ్‌ఇండియా మరో కీలక సిరీసుకు రెడీ! వెస్టిండీస్‌తో నేడు తొలి వన్డేలో తలపడనుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ఇందుకు వేదిక. సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఈసారీ కుర్రాళ్లే అలరించనున్నారు. మరోవైపు విండీస్‌ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. మరి నేటి పోరులో గెలుపెవరిది? తుది జట్లలో ఎవరుంటారు?


కుర్రాళ్ల మధ్యే పోటీ!


రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీసుకూ శిఖర్‌ ధావనే (Shikhar Dhawan) కెప్టెన్సీ చేస్తున్నాడు. కోహ్లీ, బుమ్రా, షమి, రిషభ్‌, హార్దిక్‌, కేఎల్‌ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. దాంతో ఈ సిరీసులో రాణించాలని కుర్రాళ్లు కసిగా ఉన్నారు. గబ్బర్‌తో ఓపెనింగ్‌ కోసం ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్ గిల్‌ పోటీపడుతున్నారు. అయితే కిషన్‌కే ఎక్కువ ఛాన్స్‌ ఉంది. ఫామ్‌లో ఉన్న దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌పై ఆసక్తి నెలకొంది.


షార్ట్‌ పిచ్‌ బంతుల బలహీనతతో బాధపడుతున్న శ్రేయస్‌ ఎలా ఆడతాడో చూడాలి. సంజు శాంసన్‌ నిలబడితే మాత్రం కరీబియన్లకు చుక్కలు తప్పవు. అతడు పేస్‌, బౌన్స్‌ను బాగా ఎదుర్కొంటాడు. ఎనిమిదో స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకుంటారేమో చూడాలి. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేవ్‌ ఖాన్‌, అర్షదీప్‌ పేస్‌ బౌలింగ్‌తో అదరగొడతారు. గాయం వల్ల జడ్డూకు చోటివ్వకపోవచ్చు. అక్షర్‌ పటేల్‌, యూజీ స్పిన్‌ బాధ్యతలు తీసుకుంటారు.


50 ఓవర్లు ఆడగలరా?


వెస్టిండీస్‌ జట్టును అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం 50 ఓవర్లు ఆడగలరా అన్నదే కీలక ప్రశ్న! చివరి 11 వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేస్తే 9సార్లు 50 ఓవర్లు ఆడలేదు. ఇక ఆఖరి ఐదు వన్డేల్లోనూ పరాజయమే చవిచూసింది. కుర్రాళ్లతో నిండిన టీమ్‌ఇండియాపై వీరు మెరుగైన ప్రదర్శన చేయగలరేమో చూడాలి. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాపై పరుగులు చేశాడు. ఇండియా పైనా అతడి సగటు, స్ట్రైక్‌రేట్‌ బాగున్నాయి. జేసన్‌ హోల్డర్‌ రావడం ప్లస్‌ పాయింట్‌. కీమో పాల్‌ కోలుకుంటున్నాడు. హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా ఉన్నారు. షై హోప్‌ మంచి ఓపెనరే. కానీ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలే అవకాశాలు లేకపోలేదు.


మూడేళ్ల తర్వాత మ్యాచ్‌


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. రెండ్రోజులుగా వర్షం కురవడంతో మబ్బులు కమ్ముకొనే అవకాశం ఉంది. చివరికిగా 2019లో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. కాబట్టి పిచ్‌ స్వభావం తెలుసుకొనేందుకు కొన్ని ఓవర్లు వేచిచూడక తప్పదు.


India vs West Indies 1st ODI match Probable XI


భారత్‌: శిఖర్ ధావన్‌ (కె), రుతురాజ్‌ గైక్వాడ్‌ / ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అవేశ్ ఖాన్‌ / ప్రసిద్ధ్‌  కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌


వెస్టిండీస్‌: షై హోప్‌, బ్రాండన్‌ కింగ్‌, షామ్రా బ్రూక్స్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌, రోమన్‌ పావెల్‌, జేసన్‌ హోల్డర్‌, అకేల్‌ హుస్సేన్‌, అల్జారీ జోసెఫ్‌, గుడాకేశ్‌ మోటీ, జేడెన్‌ సీల్స్‌


Also Read: భారత్‌, వెస్టిండీస్‌ తొలి వన్డే టైమింగ్‌ ఏంటి? లైవ్‌ టెలికాస్ట్‌, స్ట్రీమింగ్‌ ఆ ఒక్కదాంట్లోనే!