IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా విజయం అందుకుంది. ఆఖరి ఓవర్లో కరీబియన్లు టెన్షన్ పెట్టినా గబ్బర్ సేన 3 రన్స్ తేడాతో విక్టరీని ముద్దాడింది. ఇందులో అందరి కృషి సమానంగా ఉనప్పటికీ సంజు శాంసన్ వికెట్ కీపింగే జట్టును రక్షించింది! చివరి ఓవర్లో అతడు డైవ్ చేసి మరీ బౌండరీలను ఆపాడు. సూపర్ మ్యాన్ తరహాలో అతడు చేసిన అమేజింగ్ ఫీట్లకు ప్రశంసల జల్లు కురుస్తోంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్, వెస్టిండీస్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. టీమ్‌ఇండియా నిర్దేశించిన 309 భారీ టార్గెట్‌ను విండీస్ ఈజీగా ఛేదించేట్టు కనిపించింది. ఆఖరి ఓవర్లో అయితే పోరు ఉత్కంఠకరంగా మారింది. 49 ఓవర్లకు ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 294తో ఉంది. 6 బంతుల్లో 15 రన్స్ చేస్తే చాలు! అంటే 3 షాట్లు గట్టిగా బాదేస్తే సరిపోతుంది. క్రీజులోనేమో భారీ సిక్సర్లు దంచికొట్టే రొమారియో షెపర్డ్, అకేల్ హుస్సేన్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్, సంజూ కీపింగ్‌తో ఆకట్టుకున్నారు.
తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి ఒక రన్ వచ్చింది. మూడో బంతి బౌండరీకి వెళ్లింది. నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి. అంటే చివరి రెండు బంతుల్లో 8 కొడితే కరీబియన్లదే విజయం. మైదానంలో ఒకటే ఉత్కంఠ. షెఫర్డ్ లెగ్ సైడ్ జరిగడంతో సిరాజ్ అతడిని వెంటాడుతూ లైగ్‌వైపు దూరంగా బంతి వేశాడు. నిజానికి దీనిని కీపర్‌కు అందుకోవడం అత్యంత కష్టం. కానీ సంజు శాంసన్ ఎడమ వైపు ఒంటికాలితో సూపర్ మ్యాన్‌లా గాల్లోకి డైవ్ చేశాడు. బంతిని ఆపేశాడు. విలువైన బౌండరీని అడ్డుకున్నాడు. షెఫర్డ్ పరుగు తీయలేదు.
సంజు శాంసన్ అద్భుత ఫీట్‌కు సిరాజ్ సహా అంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాతి బంతికి 2 రన్స్ వచ్చాయి. ఆఖరి బంతిని బౌండరీకి పంపిస్తే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీస్తుంది. షెఫర్డ్‌ను తప్పించుకొని వచ్చిన బంతిని సంజు వేగంగా అందుకొన్నాడు. దాంతో 3 పరుగులతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దాంతో సంజు కీపింగ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.