India vs Sri Lanka T20 Series: శ్రీలంకతో రెండో టీ20లో సంజు శాంసన్ (Sanju Samson) బ్యాటింగ్ అద్భుతంగా ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశంసించాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడగలడో తన బ్యాటింగ్ ద్వారా చూపించాడని పేర్కొన్నాడు. యువ క్రికెటర్లకు తలుపులు తెరిచే ఉన్నాయని వెల్లడించాడు. వాటిని ఒడిసిపట్టుకొని తమను తాము నిరూపించుకోవాలని సూచించాడు. 2-0తో సిరీస్ గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
Sanju Samson క్లాస్ బ్యాటింగ్
రెండో టీ20లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా (Team India) త్వరగా ఓపెనర్ల వికెట్ల చేజార్చుకుంది. అప్పుడు శ్రేయస్ అయ్యర్‌తో (Shreyas Iyer) కలిసి సంజు శాంసన్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆచితూచి ఆడుతూనే విధ్వంసకరమైన షాట్లు బాదేశాడు. వీరిద్దరూ 47 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా సంజు తన క్లాస్ చూపించాడు. 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. లాహిరు కుమార వేసిన 13వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదేసి మ్యాచును టీమ్‌ఇండియా వైపు తిప్పేశాడు. అతడు ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆటను ముగించారు.
చాలా టాలెంట్ ఉంది
'మా బ్యాటింగ్ యూనిట్‌లో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. మేం వారికి అవకాశాలు ఇస్తూనే ఉంటాం. వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం వారిపైనే ఉంది. తనెంత బాగా బ్యాటింగ్ చేయగలడో సంజూ శాంసన్ చూపించాడు. దొరికిన ఛాన్సులు ఒడిసిపట్టుకోవడమే ముఖ్యం. కుర్రాళ్లలో చాలా టాలెంట్ ఉంది. మైదానంలోకి వెళ్లి నిరూపించుకొనేందుకు వారికో అవకాశం కావాలంతే. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికీ టైమ్ వస్తుంది. జట్టులోకి వస్తూ పోతున్న వారిని మేం జాగ్రత్తగా చూసుకోవాలి' అని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Hitman Rohit Sharma) అన్నాడు.
2-0తో సిరీస్ కైవసం
Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు.