IND Vs SL 2nd T20I, Team India Predicted XI: లంకేయులతో రెండో టీ20కి టీమ్‌ఇండియా రెడీ! ఈ మ్యాచు గెలిచేసి సిరీసును 2-0తో కైవసం చేసుకోవాలని హిట్‌మ్యాన్ (Rohit Sharma) జట్టు పట్టుదలతో ఉంది. కానీ వాతావరణం ఇందుకు సహకరించేలా లేదు. ధర్మశాలలో (Dharamsala) శనివారం వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అభిమానులకు ఇబ్బంది లేకుండా మ్యాచ్ ఎన్ని గంటలు జరుగుతుందో చూడాలి!
వర్షం ఎఫెక్ట్
రోహిత్ శర్మ కెప్టెన్సీ టీమ్‌ఇండియా 24 మ్యాచులాడితే 22 గెలిచింది. మరో స్పెషల్ ఏంటంటే లంకపై తొలి విజయంతో భారత్ వరుసగా 10 టీ20లు గెలిచింది. రెండో పోరు గెలిస్తే ఆ సంఖ్య 11కు చేరే అవకాశం ఉంది. కానీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియడం లేదు. దాదాపుగా ఈ రోజు ధర్మశాలలో వర్షం కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ వెబ్‌సైట్లు సూచిస్తున్నాయి. సాయంత్రానికి తెరపినిచ్చినా మబ్బులైతే ఉంటాయి. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచుపైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చు.
లంకకు నో ఛాన్స్
ప్రస్తుతం హిట్‌మ్యాన్ సేన జోరుమీదుంది. వరుసగా మ్యాచులు గెలుస్తూ దుమ్మురేపుతోంది. లక్నో ఏకనా స్టేడియంలో జరిగిన తొలి పోరులో భారీ తేడాతో గెలిచి 1-0తో సిరీసులో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు లంకేయులు ఇండియాలో ఒక్క సిరీసూ గెలవలేదు. 2009లో తొలిసారి 1-1తో డ్రా చేసుకున్నారు. ఆ జట్టులోనూ కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. అందుకే గెలుపు అవకాశాలైతే మనకే ఎక్కువ. చరిత్ అసలంక ఒక్కడే అర్ధశతకం చేశాడు. బౌలర్లూ రాణించడం లేదు.
దూకుడుగా కుర్రాళ్లు
పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) తొలి మ్యాచులో విధ్వంసకరంగా ఆడాడు. రోహిత్, శ్రేయస్ (Shreyas Iyer) సైతం దూకుడు మంత్రం జపిస్తున్నారు. వీరు అదరగొట్టడంతో మిడిలార్డర్ ఆడాల్సిన అవసరం రాలేదు. బహుశా జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు. ధర్మశాలలో టీమ్‌ఇండియా 4 మ్యాచులాడితే 2 గెలిచి 2 ఓడింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. పైగా మబ్బులు పట్టి ఉండటంతో భువనేశ్వర్ వంటి బౌలర్లు బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలరు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ ఉండనే ఉన్నారు.
Indias probable XI
భారత్ అంచనా జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్రచాహల్