IND vs SA T20 Playing 11: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉందని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంటున్నారు. ఐపీఎల్‌లో అతడి నాయకత్వ ప్రతిభ ఆకట్టుకుందని పేర్కొన్నారు. దినేశ్ కార్తీక్ పాత్రపై స్పష్టత ఉందన్నారు. కుర్రాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇస్తామని వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు జరిగిన మీడియాలో సమావేశంలో ద్రవిడ్ మాట్లాడారు.
'దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) పాత్రపై స్పష్టత ఉంది. డెత్ ఓవర్లలో అతడు విధ్వంసాలు సృష్టిస్తాడు. అనూహ్యంగా మ్యాచును మలుపు తిప్పగలడు. అందుకే అతడిని ఎంపిక చేశారు. అతడు కచ్చితంగా టీమ్‌ఇండియా తరఫున రాణిస్తాడు' అని ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశారు. 'హార్దిక్ పాండ్య తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్ సాంతం అతడి నాయకత్వ లక్షణాలు ఆకట్టుకున్నాయి. లీడర్‌షిప్ బృందంలో ఉండాలంటే అలాంటి కెప్టెన్సీ అవసరం. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో అతడి అత్యుత్తమ నైపుణ్యాలను వెలికి తీయడమే మా లక్ష్యం' అని ఆయన పేర్కొన్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడని ద్రవిడ్ తెలిపారు. ప్రతిసారీ అతడు అందుబాటులో ఉండాలని ఆశించడం సరి కాదన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న వారు తాజాగా, చక్కని ఫిట్‌నెస్‌తో రావాలని కోరుకున్నారు. కేఎల్ రాహుల్ శుభారంభాలు అందిస్తాడని వాల్ ఆకాంక్షించారు. 'మా టాప్-3 గురించి బాగా తెలుసు. ఎక్కువ టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు మంచి రన్‌రేట్ మెయింటేన్ చేయాలనే మేం చెప్తాం. కానీ కొన్నిసార్లు క్లిష్టమైన మ్యాచులు ఎదురవుతాయి. అందుకు తగిన టాప్-3 మాకుంది' అని ఆయన పేర్కొన్నారు.
జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అత్యంత వేగంగా బంతులు వేస్తున్నాడని ద్రవిడ్ తెలిపారు. ప్రతి సెషన్‌లో మెరుగవుతున్నాడని పేర్కొన్నారు. అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తుది జట్టులో ఎన్నిసార్లు అవకాశం దొరుకుతుందో చూడాలని వెల్లడించారు. కాగా టీమ్‌ఇండియా ప్రపంచ రికార్డుల కోసం ఆడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశారు. వాటిని పట్టించుకోబోమని తెలిపారు. బాగా ఆడితే గెలుస్తాం లేదంటే గెలవలేం అని వివరించారు.