Rishabh Pant, Van Der Dussen Banters: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు! తన మాటలతో ప్రత్యర్థి బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాడు. అందుకే అతడి బ్యాటింగ్‌తో పాటు మాటలకూ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాండరర్స్ టెస్టులోనూ అతడిలాగే వాన్ డర్ డుసెన్‌ను కవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
వాండరర్స్ టెస్టులో మొదటి రోజు నుంచి రెండు జట్ల వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వాన్ డర్ డుసెన్ పరస్పరం కవ్వించుకుంటున్నారు. ఒకరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మరొకరు ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో డుసెన్‌ను పంత్ దెబ్బకొడితే రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఆవేశపడి ఓ చెత్త షాట్ ఆడాడు.
రెండో ఇన్నింగ్స్‌లో డుసెన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పంత్ అన్న మాటలు అందరినీ నవ్వించాయి! 'ఐదారు బంతులు ఆడగానే అతడు తన గార్డ్ ఎక్కడుందో మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు కదా! అతడికి ఓ ఐడియా రావడం లేదు మరి' అంటూ డుసెన్‌ను కవ్వించాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
టీమ్‌ఇండియా రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ప్రత్యర్థికి 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి రెండు రోజుల్లో 122 పరుగులే అవసరం. భారత్ గెలవాలంటే మాత్రం ఇంకా ఎనిమిది వికెట్లు తీయాలి. పిచ్ క్షీణించిన నేపథ్యంలో భారత బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.