భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు మొదటి సెషన్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 41 పరుగులు మాత్రమే కావాలి. భారత్ గెలవాలంటే ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. వాన్ డర్ డసెన్ (22: 72 బంతుల్లో, రెండు ఫోర్లు), టెంపా బవుమా (12: 28 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు.


101-2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఈ సెషన్‌లో సాఫీగానే సాగింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టలేకపోయారు. జట్టు స్కోరు 126 వద్ద బుమ్రా బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కీగన్ పీటర్సన్ వెనుదిరిగాడు. అయితే పుజారా క్యాచ్ వదలకపోయి ఉండే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగేది.


పీటర్సన్ అవుటయ్యాక బవుమా, వాన్ డర్ డసెన్ జాగ్రత్తగా ఆడుతూ ప్రొటీస్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. కొట్టాల్సిన స్కోరు కూడా తక్కువే ఉండటంతో వారు కూడా కూల్‌గా బ్యాటింగ్ చేశారు. ఇక అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను, సిరీస్‌ను భారత్ కోల్పోవడం లాంఛనమే.