భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ప్రస్తుతం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ మైదానంలో మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు నిర్ణాయక మ్యాచ్ ఇదే. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో ఈ మూడో టెస్టు కీలకం అయింది.


అయితే రెండో రోజు జరిగిన ఓ సంఘటనతో కోహ్లీ కొంత అసంతృప్తికి లోనయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తున్న సమయంలో మరైస్ ఎరాస్మస్ తనకు వార్నింగ్ ఇచ్చారు. ఫాలో అప్ సమయంలో షమీ పిచ్‌లో డేంజర్ ఏరియాలోకి వెళ్తుండటంతో ఎరాస్మస్ హెచ్చరించక తప్పలేదు.


దీంతో విరాట్‌కు కొంచెం కోపం వచ్చినట్లు అనిపించింది. దీంతో అంపైర్ ఎరాస్మస్ వద్దకు వెళ్లి చాలా సేపు మాట్లాడాడు. చూడటానికి అది వాదన లాగానే అనిపించింది. ఆ తర్వాత రీప్లేలో చూసినప్పుడు షమీ డేంజర్ ఏరియాలోకి వెళ్లలేదని తెలిసింది.


టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంత తక్కువ స్కోరు చేసినప్పటికీ.. విరాట్ కోహ్లీ ఫాంలోకి రావడం భారత్ క్రికెట్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. మొదటిరోజే డీన్ ఎల్గర్ వికెట్ కూడా తీశారు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కగా.. షమి, ఉమేశ్ యాదవ్‌లు రెండేసి వికెట్లు తీశారు.