దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్థ శతకం సాధించాడు. 288 పరుగుల లక్ష్య చేధనలో అర్థశతకం కొట్టిన అనంతరం విరాట్ తన సంతోషాన్ని చేతులు ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ, అనుష్కల కూతురు వామిక మొదటిసారి స్టేడియంకి రావడమే కోహ్లీ సంతోషానికి కారణం.


అనుష్క కూడా వామికకు కోహ్లీని చూపిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. వామిక మొదటిసారి ప్రపంచానికి కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దురదృష్టవశాత్తూ విరాట్ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. దీంతో 71వ శతకం కోసం విరాట్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.


మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (124: 130 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ జానేమన్ మలన్ (1: 6 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. ఫాంలో ఉన్న కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 


ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ (15: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా త్వరగానే అవుటయ్యాడు. ఈ దశలో డికాక్‌కు వాన్ డర్ డుసెన్ (52: 59 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) జత కలిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో డికాక్‌ను అవుట్ చేసి బుమ్రా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (39: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మరోవైపు వేగంగా ఆడాడు. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మరో వికెట్ యజ్వేంద్ర చాహల్ ఖాతాలో పడింది.