టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో ఏడు పరుగులు చేస్తే వాండరర్స్‌లో అత్యంత విజయవంతమైన పర్యాటక బ్యాటర్‌గా అవతరిస్తాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు జాన్‌ రీడ్‌ రికార్డును బద్దలు చేస్తాడు.


ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ తన అత్యుత్తమ ఫామ్‌లో లేడు. సమయోచితంగా పరుగులు చేస్తున్నా సెంచరీలు మాత్రం కొట్టడం లేదు. అతడు శతకం చేయక కనీసం మూడేళ్లు అవుతోంది. దక్షిణాఫ్రికాలో సెంచూరియన్‌లో అర్ధశతకం చేజార్చుకున్నాడు. తనకు అచ్చొచ్చిన వాండరర్స్‌లోనైనా కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


వాండరర్స్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 310 పరుగులు చేశాడు. అతడు మరో 7 పరుగులు చేస్తే జాన్‌ రీడ్‌ 316 రికార్డును బద్దలు కొట్టేస్తాడు. ఈ మైదానంలో అత్యంత విజయవంతమైన పర్యాటక బ్యాటర్‌గా అవతరిస్తాడు. 2013లో విరాట్‌ ఇక్కడ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌ డ్రా అయింది. ఇక 2018లో  వరుసగా 54, 41 పరుగులు సాధించాడు.


వాండరర్స్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్లు



  • జాన్‌ రీడ్‌ - 2 మ్యాచుల్లో 316

  • విరాట్‌ కోహ్లీ - 2 మ్యాచుల్లో 310

  • రికీ పాంటింగ్‌ - 4 మ్యాచుల్లో 263

  • రాహుల్‌ ద్రవిడ్‌ - 2 మ్యాచుల్లో 262

  • డామీన్‌ మారిన్‌ - 2 మ్యాచుల్లో 255






దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారతీయుల జాబితాలో రెండో స్థానానికి చేరేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ 11 మ్యాచుల్లో 624 పరుగులు చేయగా కోహ్లీ 6 మ్యాచుల్లో 611 పరుగులు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే చాలు. ఇక సచిన్ తెందూల్కర్‌ 15 మ్యాచుల్లో 1161 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రికార్డును బద్దలు చేయడం అంత సులభం కాదు.