వాండరర్స్ టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96 నాటౌట్: 188 బంతుల్లో, 10 ఫోర్లు) దగ్గరుండి ప్రొటీస్‌ను గెలిపించాడు. టెస్టు సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టెస్టులో గెలిచిన వారికి సిరీస్ దక్కనుంది. నిజానికి వాండరర్స్ మనకు బాగా కలిసొచ్చిన స్టేడియం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడగా.. ఇదే మొదటి ఓటమి. 2018లో భారత్ ఇక్కడ విజయం సాధించింది. 2007లో భారత్ ఇక్కడే ఫైనల్స్ ఆడి టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది.


నాలుగో రోజు వర్షం కారణంగా లంచ్ వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. అనంతరం 118-2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ను ఈరోజే ముగించాలన్నట్లు ఆడారు. కేవలం 27.4 ఓవర్లలోనే 122 పరుగులు సాధించారు. దాదాపు నాలుగు పైగా రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా ఈరోజు పరుగులు చేసింది.


డీన్ ఎల్గర్, వాన్ డర్ డసెన్ (40: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు) మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. 175 పరుగుల వద్ద షమీ.. వాన్ డర్ డసెన్‌ను అవుట్ చేయడంతో అద్భుతం జరుగుతుందేమోనని భారత అభిమానులు ఆశపడ్డారు. అయితే టెంపా బవుమా, డీన్ ఎల్గర్ అస్సలు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఆడారు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లతో విజయం అందుకుంది. భారత బౌలర్లలో షమీ, శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.