హైదరాబాద్ సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో వినూత్నంగా ఏర్పాటైన "రాక్ మ్యూజియం"ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ(స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ(స్వతంత్ర), మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు మంత్రి పర్యటించనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దేశం వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో 55 మిలియన్ సంవత్సరాల నుంచి 3.3 బిలియన్ సంవత్సరాల కాలం నాటి రాళ్లు కూడా ఉన్నాయి.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
బిగ్ ఎర్త్ డేటా అత్యంత కీలకం
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో బిగ్ ఎర్త్ డేటా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన భారత్ ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందని మంత్రి చెప్పారు. భూ శాస్త్ర రంగ అభివృద్ధికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. సాధికార భారతదేశ నిర్మాణ సాధనకు భూగర్భ శాస్త్రం అంశాలు ఎంతగానో సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. వినూత్న విధానాలతో శాస్త్రీయ విధానాలను అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు సౌలభ్య జీవన సౌకర్యం అందించవచ్చని కేంద్ర మంత్రి అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారని అన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలు కార్యరూపం దాల్చేలా చూసేందుకు సమస్య పరిష్కరానికి శాస్త్ర, సాంకేతిక పరిష్కార మార్గాలు అన్వేషించాలని మంత్రి అన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా వినూత్నంగా ఆలోచించి ప్రజల సమస్యలను పరిష్కరించే అంశానికి ప్రధానమంత్రి మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
కలలు సాకారం కావాలి
దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సమయంలో సీఎస్ఐఆర్ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రగతిపథంలో పయనిస్తున్నదని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సమయంలో శాస్త్ర రంగంతో సంబంధం ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు శాస్త్ర సాంకేతిక అన్వేషణలకు ప్రాధాన్యత ఇచ్చి స్వయం సమృద్ధ భారత నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాదితో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందని అన్నారు. 100 సంవత్సర స్వాతంత్రం పూర్తి చేసుకునేందుకు 25 సంవత్సరాల సమయం ఉందని, ఈ సమయంలో కలలు సాకారం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ అభివృద్ధిలో సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ రెండు సంస్థల కృషి చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి