భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్టులో ఓ ట్విస్ట్‌! రెండు జట్ల గెలుపోటములకు కీలకమైన నాలుగో రోజు ఆట ఇంకా ఆరంభం కాలేదు. వాండరర్స్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటమే ఇందుకు కారణం. ఈ పరిస్థితులు టీమ్‌ఇండియాకు అనుకూలంగా మారినా ఆశ్చర్యం లేదు!!






వాండరర్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లోటును మినహాయిస్తే ప్రత్యర్థికి 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. డీన్‌ ఎల్గర్‌ (46 బ్యాటింగ్‌) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. డుసెన్‌ (11 బ్యాటింగ్‌) అతడికి తోడుగా ఉన్నాడు.  ఆ జట్టు విజయానికి రెండు రోజుల్లో 122 పరుగులే అవసరం.  భారత్‌ గెలవాలంటే మాత్రం ఇంకా ఎనిమిది వికెట్లు తీయాలి.






ఇలాంటి రసవత్తరమైన సమయంలో వాండరర్స్‌లో వర్షం కురవడం మొదలైంది. దాంతో సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పేశారు. మైదానంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి చిత్తడిగా మారింది. వర్షం ఆగినట్టే ఆగి మళ్లీ కురుస్తోంది. పిచ్‌ క్యూరేటర్‌ ఇవాన్‌ ఫ్లింట్‌, రిజర్వు అంపైర్‌ బోంగాని జెలె గొడుగులు తీసుకొని మైదానంలోకి వెళ్లీ సుదీర్ఘంగా చర్చించారు. జెలె మైదానాన్ని గట్టిగా తొక్కి ఎంత తడిగా ఉందో పరిశీలించారు. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిస్థితులను పరిశీలిస్తుంటే మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది.


వర్షం కురిసే సందర్భంలో బౌలింగ్‌ జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మబ్బులు ఉన్నప్పుడు తడిగా ఉన్న బంతితో ఎక్కువ స్వింగ్‌ రాబట్టొచ్చు. బ్యాటర్లు ఎక్కువగా ఎడ్జ్‌ అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో బుమ్రా, షమి, సిరాజ్‌, శార్దూల్‌ కీలకం అవుతారు. పిచ్‌లో ఒకవైపు పగుళ్లు, కాలి ముద్రలు ఉన్నాయి కాబట్టి అశ్విన్ అద్భుతాలు చేయగలడు!