సఫారీలతో రెండో సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది! తొలిపోరులో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. సిరీసును సమం చేయాలని భావిస్తోంది. ఇదే ఊపు కొనసాగించాలని మరోవైపు దక్షిణాఫ్రికా అనుకుంటోంది. అచ్చొచ్చిన కటక్‌లో పంత్ సేనను ఓడించి 2-0తో పైచేయి సాధించాలని కోరుకుంటోంది. మరి ఈ మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్లలో ఉండేదెవరు? కటక్‌లో ఇంతకు ముందేం జరిగింది?
కటక్‌లో కష్టాలే!
కటక్‌లోని బారాబటి స్టేడియంలో ఇప్పటి వరకు రెండే టీ20లు జరిగాయి. రెండింట్లోనూ స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాతో ఏడేళ్ల క్రితం ఇక్కడే జరిగిన మ్యాచులో టీమ్‌ఇండియా 92 రన్స్‌కే ఆలౌటైంది. నాలుగో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. డేవిడ్ మిల్లర్ (David Miller), రబాడా కలిసే భారత్‌ను ఓడించారు. మరో మ్యాచులో శ్రీలంక 87కే కుప్పకూలింది. రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. దిల్లీతో పోలిస్తే కటక్ కాస్త చల్లగానే ఉంటుంది. స్వింగ్, పేస్ లభించే ఛాన్స్ ఉంది. తేమ శాతం ఎక్కువే కాబట్టి మ్యాచు ఈజీగా ఉండదు.
వ్యూహాలు మారిస్తేనే!
కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్ గాయపడటంతో టీమ్‌ఇండియా వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్ పరంగా జట్టుకేం ఇబ్బందుల్లేవ్. అందరూ ఫామ్‌లోనే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ మరికాస్త పరిణతితో ఆడాలి. ఇషాన్ దూకుడు కలిసొచ్చే అంశం. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య (Hardik Pandya), రిషభ్ పంత్ (Rishabh Pant) దూకుడుగా ఆడుతున్నారు. మొదటి మ్యాచులో టీమ్‌ఇండియా బౌలర్లు సామర్థ్యం మేరకు బంతులు వేయలేదు. డేవిడ్ మిల్లర్, డుసెన్‌ను ఔట్ చేయలేక చేతులెత్తేశారు. యుజ్వేంద్ర చాహల్‌ను ఉపయోగించుకోవడం, బౌలర్లను మార్చడంలో కెప్టెన్ పంత్ ఇబ్బంది పడ్డాడు. వ్యూహాలను సరిగ్గా అమలు చేస్తే జట్టుకు తిరుగుండదు.
మారుతున్న సఫారీల దశ!
రెండేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టులో కీలక మార్పులు జరుగుతున్నాయి. అదృష్టంపై ఆధారపడటం తగ్గింది. ఆటగాళ్లు సామర్థ్యం మేరకు ఆడుతున్నారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ రెజువనేట్‌గా కనిపిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్‌పై పట్టు సాధించడంతో అతడిని ఔట్ చేయడం కష్టమవుతోంది. మిడిలార్డర్లో డుసెన్, మార్‌క్రమ్ వంటి సహరులు అతడికి తోడుగా నిలుస్తున్నారు. ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కెప్టెన్ తెంబా బవుమా మరికాస్త జోరు పెంచాలి. బౌలింగ్ పరంగా సఫారీలెప్పుడూ ముందుంటారు. రబాడా, ప్రిటోరియస్, పర్నెల్, నోకియా ఉన్నారు. కేశవ్ మహారాజ్, శంషి స్పిన్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
IND vs SA 2nd T20 Probable XI
భారత్ (అంచనా): ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (అంచనా): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రయిజ్ షంసి,కగిసో రబడ, ఆన్రిచ్ నోకియా