IND Vs SA 1st Test: సెంచూరియన్‌ టెస్టుపై కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి! ఎందుకంటే అక్కడ ఆకాశం మేఘావృతమైంది. బాక్సింగ్‌ డే నాడు 60 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ, వెబ్‌సైట్లు తెలియజేస్తున్నాయి. ఒక విధంగా భారత్‌, దక్షిణాఫ్రికా అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే!


భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచులు టెస్టు సిరీసు ఆదివారమే ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1:30 గంటలకు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్స్‌ మైదానంలో మ్యాచ్‌ మొదలవుతుంది. టెస్టు సిరీసులు గెలవాలంటే మొదటి మ్యాచ్‌ బాగా సాగడం ముఖ్యం. లేదంటే నెగెటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతుంది. అందుకే తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు కోరుకుంటున్నాయి.




సెంచూరియన్‌ వాతావరణం ఉదయం పొడిగానే అనిపిస్తున్నా మ్యాచ్‌ మధ్యలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసింది. ఏకధాటిగా ఒకట్రెండు గంటలు వాన పడుతుందని వాతావరణ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఉరుములతో కూడిన వర్షం పడుతుందని అంచనా. ఇక రెండో రోజైన సోమవారం 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.


ఇక ఈ సిరీసులో టీమ్‌ఇండియా ఎంతగానో శ్రమించింది. కొన్ని రోజులుగా నెట్స్‌లో కష్టపడింది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన అనుభవాన్ని కుర్రాళ్లకు వివరించాడు. ఇక్కడి స్పాంజీ బౌన్స్‌, పేస్‌ను ఎలా ఎదుర్కోవాలో సూచించాడు. ప్రత్యేకంగా ఓపెనర్లతో ఎక్కువ గంటలు సాధన చేయించడం గమనార్హం. మిడిలార్డర్లో ఎవరిని తీసుకుంటారో తెలియడం లేదు. హనుమ విహారి, అజింక్య రహానె, శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మధ్య పోటీ విపరీతంగా ఉంది.






అంచనా జట్టు: విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, రిషభ్ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్‌ సిరాజ్‌