భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సెంచూరియన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు రెండో సెషన్ ఆట పూర్తయింది. ఈ సెషన్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోని టీమిండియా రెండో సెషన్‌లో మాత్రం రెండు వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లూ ఒకే ఓవర్‌లో పడ్డాయి. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 41 ఓవర్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60: 123 బంతుల్లో, 9 ఫోర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన చతేశ్వర్ పుజారా (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుటయ్యారు. అయితే ఆ తర్వాత కేఎల్ రాహుల్ (68 బ్యాటింగ్: 166 బంతుల్లో, 11 ఫోర్లు), విరాట్ కోహ్లీ (19 బ్యాటింగ్: 54 బంతుల్లో, రెండు ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.


83-0తో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు ఎటువంటి తడబాటు లేకుండా ఆడారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో బౌండరీతో మయాంక్ అగర్వాల్ తన అర్థసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ తడబడకుండా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది మూడోసారి. 2006లో వసీం జాఫర్, దినేష్ కార్తీక్, 2010లో గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ప్రొటీస్ గడ్డపై 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించింది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ మాత్రమే.


మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. వెంటనే పుజారా కూడా మొదటి బంతికే పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ కొంచెం కష్టాల్లో పడ్డట్లు అనిపించినా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు.


ఈ జోడి మరో సెషన్ పాటు వికెట్ పడకుండా ఆడగలిగితే ఈ టెస్టులో భారత్ పటిష్టస్థితికి చేరుకున్నట్లే. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. మిగతా ఎవరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఫాంలోకి రావడానికి కోహ్లీకి ఇదే సరైన సమయం అనుకోవచ్చు.