ఓవల్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో భారత్‌ గెలవడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను BCCI ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘దీన్ని మిస్సవ్వకండి’ అంటూ బీసీసీఐ వ్యాఖ్యను జత చేసింది. 






ఓపెనర్, సెంచరీ వీరుడు రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఈ వీడియోలో ప్రత్యేకంగా తమ అనుభవాలను పంచుకున్నారు. మ్యాచ్ అవ్వగానే ఆటగాళ్లంతా ఫుల్ జోష్‌తో డ్రెస్సింగ్‌ రూమ్‌కి చేరుకున్నారు. మైదానం నుంచి వస్తున్న ఆటగాళ్లను... సిబ్బంది, సహచర ఆటగాళ్లు అభినందించారు. ఇంగ్లాండ్‌ ఆఖరి వికెట్‌ పడగానే మైదానం సంబరాలతో హోరెత్తింది. అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. 






‘వికెట్‌ మందకొడిగా ఉండటంతో 5వ రోజు మరింత కష్టపడ్డాం. మంచి లెంగ్తుల్లో బంతులు వేసి... ఇంగ్లాండ్ పరుగులు చేయకుండా నియంత్రించేందుకు ప్రయత్నించాం. అప్పుడు వికెట్లు పడతాయని తెలుసు’ అని ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు.‘గొప్పగా అనిపిస్తోంది. నేను ఆడతానని తెలిసిన రోజు నుంచి ఆటపై ప్రభావం చూపించాలని భావించాను. జట్టు గెలిచేందుకు అవసరమైన ప్రతిదీ చేయాలనుకున్నాను’ అని ఠాకూర్‌ తెలిపాడు. 






ప్రధాని మోదీ సహా పలువురు ఓవల్ టెస్టులో విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది. మాంచెస్టర్ వేదికగా ఈ టెస్టు జరగనుంది.