లార్డ్స్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సాధించిన విజయంతో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు కోహ్లీ కెప్టెన్‌గా 63 టెస్ట్‌ల్లో 37 విజయాలు సాధించాడు. దీంతో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్‌(36 టెస్ట్‌ విజయాలు)ను అధిగమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్ అగ్రస్థానంలో 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


AlsoRead: Dhoni: రెట్రో జెర్సీలో ధోనీ... ఓ యాడ్ షూట్‌లో... దుబాయ్‌లో ధోనీ


ఇక స్మిత్‌ తర్వాతి స్థానంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రెండో స్థానంలో నిలిచాడు. స్టీవ్‌ వా(ఆస్ట్రేలియా) 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ... స్టీవ్ వా స్థానంపై కన్నేశాడు. మరోవైపు, లార్డ్స్ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 1986లో కపిల్‌ దేవ్, 2014లో ధోని మాత్రమే ఈ మైదానంలో వారి సారథ్యంలో ఆడిన టెస్టుల్లో విజయం సాధించారు. 


AlsoRead: T20 World Cup: కోహ్లీ పుట్టిన రోజు నాడు భారత్ ఎవరితో మ్యాచ్ ఆడనుందో తెలుసా?


లార్డ్స్ విజయంతో కోహ్లీ... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై అత్యధిక విజయాలను అందుకున్న ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక భారత్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ(37) అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ తరువాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో, 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. 


AlsoRead: T20 World Cup 2021 Schedule: క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ...అక్టోబర్ 24న భారత్ vs పాకిస్తాన్...T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల


ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అయ్యింది. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌లో 3వ టెస్టు ఆగస్టు 25న లీడ్స్ వేదికగా ప్రారంభంకానుంది. రెండో టెస్టులో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.