ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దాడికి 210 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పరాజయం మూటగట్టుకుంది.






అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటై 367 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (127, 256 బంతుల్లో), కేఎల్ రాహుల్ (46), పుజారా (61), కోహ్లీ (44), పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) ఆశించిన స్థాయిలో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన పరుగులను అధిగమించడంతో పాటు భారీ ఆధిక్యాన్ని సంపాదించుకోగలిగింది. తొలి, రెండో ఇన్నింగ్సులో శార్దూల్ ఠాకూర్ (57, 60) రాణించడంతో భారత్‌కు కాస్త ఊరట కలిగించింది. 






50ఏళ్ల నిరీక్షణకు తెర   


50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని నమోదు చేయలేదు. తాజా విజయంతో ఆ చెత్త రికార్డుకు తెరపడినట్లైంది. ఇక్కడ భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.



ఆ తర్వాత టీమిండియా ఆ మైదానంలో 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా 5 మ్యాచ్‌లను డ్రా చేసుకున్న భారత జట్టు 2011, 2014, 2018 పర్యటనల్లో ఘోర పరాజయాలను చవి చూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా... 2014 టూర్‌లో ఇన్నింగ్స్, 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో ఏకంగా 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.






నిరాశపరిచిన జో రూట్


తొలి మూడు టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఓవల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 21, 36 పరుగులతో నిరాశపరిచాడు. రూట్ రాణించకపోవడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. రూట్ మైదానంలో ఉన్నంతసేపూ భారత్ విజయంపై అభిమానులు ఆశపెట్టుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఎప్పుడైతే రూట్ ఔటయ్యాడో అప్పుడు ఊపిరి పీల్చుకున్న అభిమానులు... మ్యాచ్ భారత సొంతం అని సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెట్టారు.      


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 191
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 290
భారత్ రెండో ఇన్నింగ్స్ : 466
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 210


సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.