13వ బ్రిక్స్​ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ నెల 9న భారత్​ నేతృత్వంలో జరగనుంది. కొవిడ్ దృష్ట్యా వర్చువల్ గా ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2012, 2016 తర్వాత బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సుకు భారత్​ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి.


ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవనున్నారు.


భారత్ అజెండా ఏంటి?


సాధారణంగా ఐదు సభ్య దేశాలకు ప్రయోజనకరమైన విషయాలను ఈ సదస్సులో ప్రస్తావిస్తారు. అయితే బ్రిక్స్​ దేశాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని భారత్​ ఆకాక్షిస్తుంది. కొవిడ్-19 సంక్షోభాన్ని సభ్యదేశాలన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆశిస్తుంది.


అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా, రాజకీయ అంశాలపై బ్రిక్స్​ దేశాలు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని భారత్​ కోరుతోంది.


భారత్​-చైనా ఘర్షణ ప్రభావం..


ఇటీవల చెలరేగిన సరిహద్దు వివాదం, గల్వాన్​ ఘర్షణతో క్షీణించిన భారత్​-చైనా సంబంధాలు బ్రిక్స్ సమావేశంపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఇరుదేశాల సంబంధాల పునరుద్ధరణకు బ్రిక్స్​ సమావేశం సహాయపడనుంది.


ఆసియాలో ఆధిపత్యానికి ఆరాడపడుతున్న చైనాకు గల్వాన్​లో భారత్​ గట్టి బదులిచ్చింది. భారత్​ను కాదని ఆసియాలో వ్యాపారాన్ని విస్తరించడం చైనాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే భారత్​లో చైనాకు పెద్ద మార్కెట్​ ఉంది. అందుకే భారత్​తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదని చైనా భావిస్తుంది. అందుకే ఈ బ్రిక్స్​ సమావేశానికి డ్రాగన్ ఎలాంటి అడ్డుచెప్పలేదు. సరిహద్దు వివాదంపై బ్రిక్స్​ సమావేశంలో చైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే గట్టిగా బదులిచ్చేందుకు భారత్​ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  


ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..


2020 బ్రిక్స్​ సమావేశంలో ప్రస్తావించిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ కట్టుబడి ఉంది. అయితే ఇందుకోసం సరైన కార్యాచరణపై ఈ ఏడాది భేటీలో చర్చించనున్నారు.


బ్రిక్స్ అంటే..


బ్రిక్స్ (BRICS) అనేది అభివృద్ధి చెందుతున్న ఐదు ప్రపంచ దేశాల కూటమి. బ్రిటన్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఇందులోని సభ్య దేశాలు. ఈ ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థల ఆధారంగా ఈ కూటమి ఏర్పడింది.


ప్రపంచ జనాభాలో 44 శాతం బ్రిక్స్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో 30 శాతం, వాణిజ్యంలో 18 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోంది.






ఎందుకీ మీటింగ్..?


ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేతలు పాల్గొంటారు. 2009 నుంచి బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి.






చివరి మీటింగ్ ఎక్కడ..?


2020లో జరిగిన 12వ బ్రిక్స్​ సమావేశానికి రష్యా అధ్యక్షత వహించింది. కరోనా కారణంగా వర్చువల్​గా ఈ సమావేశం జరిగింది.