ఇంగ్లాండ్ x భారత్ మధ్య ఐదో టెస్టుకు లైన్ క్లియర్ అయ్యింది. టీమిండియా ఫిజియోకి కరోనా పాజిటివ్ రావడంతో శుక్రవారం జరగబోయే చివరి టెస్టుపై పలు అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఆటగాళ్లకు రెండోసారి నిర్వహించిన టెస్టుల్లో అందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్ జరుగుతుందని తెలిసింది.
ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరగబోయే టెస్టులో ఆడేందుకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి మార్గం సుగుమమైంది. గాయం కారణంగా ఇటీవల ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టుకి దూరమైన షమి... ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో హుషారుగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో.. అతడు ఐదో టెస్టులో ఆడటం లాంఛనంగా కనిపిస్తోంది. కానీ.. ఎవరి స్థానంలో షమిని ఆడిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న.
నాలుగో టెస్టులో ఉమేశ్ యాదవ్ ఆరు వికెట్లు పడగొట్టి.. టీమిండియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అలానే శార్ధూల్ ఠాకూర్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో విలువైన హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో.. ఈ ఇద్దరినీ తప్పించే సూచనలు కనిపించడం లేదు. ఇక మిగిలింది బుమ్రా, సిరాజ్.
నాలుగో టెస్టులో ఆడుతూ రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా గాయపడ్డారు. రోహిత్ మోకాలికి గాయమవ్వగా.. పరుగు తీసే సమయంలో పుజారా కాలి మడమకి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల్ని పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మెడికల్ టీమ్.. ఈరోజు రాత్రికి ఓ క్లారిటీకి రానుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఐదో టెస్టులో ఆడలేకపోతే.. పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌కి ఛాన్స్ దక్కనుంది. అలానే పుజారాకి బదులుగా సూర్యకుమార్ యాదవ్ లేదా హనుమ విహారి ఆడే అవకాశం ఉంది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకి చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఐదో టెస్టు ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ జరగనుండటంతో.. జస్‌ప్రీత్ బుమ్రాపై పని భారం తగ్గించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐదో టెస్టులో బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.