ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఓవల్ మైదానంలో ఆంగ్లేయులకు చుక్కలు చూపిస్తోంది. నిలబడి సిక్సర్లు దంచికొట్టే ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు కకావికలం చేసేశారు. 3 ఓవర్లు ముగిసే లోపే 7 పరుగులకే 3 వికెట్లు తీశారు. ఆ ముగ్గురూ డకౌటే కావడం ప్రత్యేకం.
ఓవల్ మ్యాచులో టీమ్‌ఇండియా (IND vs ENG 1st odi) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంతి అందుకున్న క్షణం నుంచి పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతిని ఆడబోయిన జేసన్ రాయ్ (Jason Roy) వికెట్టైతే ఎగిరిపోయింది. వైడ్ లైన్‌లో వచ్చిన బంతి రాయ్ స్వింగ్ అవుతుందని భావించాడు. కానీ బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి వికెట్లను ఎగరగొట్టింది. ఆఖరి బంతికి జోరూట్ (Joe Root) సైతం ఇలాగే బోల్తా పడ్డాడు. వైడ్ లైన్‌లో వెళ్తున్న బంతిని ఆడబోయాడు. బ్యాటుకు తగిలిన బంతి వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది.
ఆ తర్వాతి ఓవర్ నాలుగో బంతికి మహ్మద్ షమి అద్భుతం చేశాడు. రౌండ్ ది వికెట్ వెళ్లి బౌలింగ్ చేశాడు. స్వింగైన బంతి బెన్ స్టోక్స్ బ్యాటు అంచుకు తగిలి కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో 7 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు నష్టపోయింది. ఆఖరి టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన జానీ బెయిర్‌స్టో (7)నూ బుమ్రానే (Jasprit Bumrah) పెవిలియన్‌కు పంపించాడు. ఏ మాత్రం డీవియేట్ అవ్వని 5.3 వ బంతి జానీ బ్యాటుకు తగిలి గాల్లోకి లేచింది. ఫస్ట్ స్లిప్‌లోకి ఎగిరిన పంత్ దానిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాంతో 17 పరుగులకు ఇంగ్లాండ్ 4 వికెట్లు పడిపోయింది.
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ అవ్వడం ఇది రెండోసారి. 2018లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా జేసన్ రాయ్, బెయిర్ స్టో, రూట్‌ను ఔట్ చేసింది. ఇప్పుడు ఓవల్‌లో వారి సొంతగడ్డపై రాయ్, రూట్, స్టోక్స్‌ను టీమ్‌ఇండియా డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించింది. మొత్తంగా 7 ఓవర్లకు ఇంగ్లాండ్ 4 వికెట్లు నష్టపోయి 26 పరుగులతో ఉంది.