IND vs ENG 1st ODI Preview: ఇంగ్లాండ్‌తో మరో సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది! 2-0తో టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న హిట్‌మ్యాన్‌ సేన వన్డే సిరీసునూ ఎగరేసుకుపోవాలని పట్టుదలగా ఉంది. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. చివరి 10 వన్డేల్లో 9 గెలిచిన ఆంగ్లేయులు ఉత్సాహంతో ఉన్నారు. పొట్టి సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. మరి ఓవల్‌లో జరిగే తొలి వన్డేలో గెలుపెవరిది? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్‌ పరిస్థితి ఏంటి?


SKY హిట్టింగ్‌!


ఐదో టెస్టు ఓటమికి టీమ్‌ఇండియా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 సిరీసులో దుమ్మురేపింది. ఇప్పుడు వన్డేలపై దృష్టి సారించింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) మంచి రికార్డుంది. వరుస సెంచరీలు కొట్టిన అనుభవం ఉంది. విరాట్‌ (Virat kohli) పరిస్థితి అర్థమవ్వడం లేదు. ఆఖరి టీ20లో సెంచరీ దంచికొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌పై (Suryakumar Yadav) అందరి చూపు నెలకొంది.


పొట్టి సిరీసులో ఓపెనర్‌గా రాణించని రిషభ్ పంత్‌ ఈ సారి మిడిలార్డర్‌కు వెళ్లనున్నాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి శిఖర్ ఓపెనింగ్‌ చేయనున్నాడు. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఎలా ఆడతాడోననన్న ఆసక్తి నెలకొంది. ఏడాది తర్వాత అతడు తొలి వన్డే ఆడుతున్నాడు. బౌలింగ్‌ ఎన్ని ఓవర్లు వేస్తాడో చూడాలి. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమికి చోటు ఖాయం. సిరాజ్‌, ప్రసిద్ధ్‌లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరు ఆల్‌రౌండర్లకు చోటు దక్కనుంది.


చితక్కొట్టుడు త్రయం!


పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్‌ ఎప్పటికీ ప్రమాదకరమే! టీ20 సిరీస్‌ ఓడినంత మాత్రాన తక్కువ అంచనా వేయొద్దు. ఈ మధ్యే నెదర్లాండ్స్‌పై ప్రపంచ రికార్డు స్కోరు కొట్టేశారు. కొత్త కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌పై (Jos Buttler) ఒత్తిడి నెలకొంది. ఏ క్షణమైనా అతడు దంచకొట్టగలడు. జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow), జో రూట్‌, బెన్‌స్టోక్స్‌ తిరిగొచ్చేశారు. మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో లివింగ్‌స్టోన్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఓపెనింగ్‌లో జేసన్‌ రాయ్‌ ప్రమాదకరంగా ఉన్నాడు. డేవిడ్‌ విలే, టాప్లే సామ్‌కరన్‌ రూపంలో ముగ్గురు లెఫ్ట్‌ హ్యాండ్‌ పేసర్లు ఉన్నారు. తోడుగా బ్రేడన్‌ కేర్స్‌ ఉన్నాడు. ఆంగ్లేయుల్లో ఏ ఇద్దరు నిలబడ్డా పరుగుల వరద పారడం ఖాయం.


అందరికీ సహకారం!


ఓవల్‌ పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. అయితే ఎక్కువ వేడి, ఉక్కపోత వల్ల బంతి స్వింగ్‌ అవ్వడం కష్టమే! 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అవ్వనుంది. ఎండ కాసినా చీకటి పడ్డాక ఫ్లడ్‌లైట్ల కిందే పరుగులు చేయడం సులువు. స్పిన్నర్లకూ పిచ్‌ నుంచి సహకారం అందుతుంది.


IND vs ENG 1st ODI Probable XI


ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, డేవిడ్‌ విలే, బ్రేడన్‌ కేర్స్‌/రీస్‌ టాప్లే, మ్యాట్‌ పార్కిన్‌సన్‌


భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌/ రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌