KL Rahul becomes the 3rd fastest player to score 2000: టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆసియాకప్‌లో ఎక్కడ వదిలేశాడో అక్కడ్నుంచే బాదుడు మొదలు పెట్టాడు. మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లోనే 3 బౌండరీలు, 3 సిక్సర్లతో 50 పరుగులు మైలురాయి అందుకున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయి అధిగమించిన మూడో ఆటగాడిగా అవతరించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 52 ఇన్నింగ్సుల్లోనే 2000 పరుగులు సాధించాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లీ 56 ఇన్నింగ్సులు తీసుకున్నాడు. అతడిలాగే అత్యంత టెక్నికల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన కేఎల్ రాహుల్ ఇందుకు 58 ఇన్నింగ్సులు తీసుకున్నాడు.
మొహలి పిచ్‌పై కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంచైజీకి అదే హోమ్ గ్రౌండ్ కావడంతో అక్కడ అనుభవం ఉంది. పైగా బౌన్స్‌ను రాహుల్ ఇష్టపడతాడు. టీమ్‌ఇండియా సైతం తొలుత బ్యాటింగ్ తీసుకున్నప్పుడు దూకుడుగా ఆడాలన్న అప్రోచ్ తీసుకుంది. అందుకే రాహుల్ రెచ్చిపోయి ఆడాడు. అయితే 55 పరుగులు చేశాక అతడు ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన 11.4వ బంతికి బౌండరీ బాదిన అతడు తర్వాతి బంతిని భారీ సిక్సర్ బాదబోయాడు. మిస్‌టైమ్ కావడంతో డీప్ స్క్వేర్‌లో నేథన్ ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.